West Bengal, March 7: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా..తాజాగా ప్రధాని మోదీ కలకత్తాలో టీఎంసీపై విరుచుకుపడ్డారు. బెంగాల్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతితో పాటు ‘బంగారు బంగ్లా’, ప్రగతి పథంలో పయనించే బెంగాల్‌ను ను కోరుకుంటున్నారని తెలిపారు.
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో పర్యటించిన (West Bengal Assembly Election 2021) సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎందరో మంది ముఖ్యులకు సాక్షిగా నిలిచిందని, అలాగే బెంగాల్ అభివృద్ధికి విఘాతకులకు కూడా సాక్షిగా నిలిచిందన్నారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు.
బెంగాల్ ప్రజల ఆశలను తాము నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్ సంస్కృతిని కాపాడడానికి, అభివృద్ధి చేస్తామన్న హామీని ఇవ్వడానికే బెంగాల్‌కు వచ్చినట్లు ఆయన వివరించారు. బెంగాల్‌ను అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే మమతకు పట్టం కట్టారని, కానీ... ఆ నమ్మకాన్ని మమత వమ్ము చేశారని విమర్శించారు.
మార్పు కోసం బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీపై ఉంచిన విశ్వాసాన్ని ఆమె వమ్ము చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ కలిసి ఒకవైపు ఉంటే, బెంగాల్ ప్రజలంతా ఒకవైపు ఉన్నారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (West Bengal Polls 2021) ప్రకటించిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రంలో ప్రచారానికి ఆదివారం వచ్చారు. బెంగాల్ ప్రజలను అవమానించారు.
సోదరీమణులు, ఆడకూతుళ్లను వేధింపులకు గురిచేసారు. అయితే ఇక్కడి ప్రజలు ఆశావహ దృక్పథాన్ని మాత్రం వదులుకోలేదు' అని మోదీ అన్నారు. 'బంగారు బంగ్లా' కలలు సాకారం చేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని, బెంగాల్ అభివృద్ధికి, పెట్టుబడులు పెరిగేందుకు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణకు, మార్పు తీసుకువచ్చేందుకు తాను భరోసా ఇస్తున్నానని అన్నారు.
వందేమాతరం నినాదంతో ప్రధాని తన ప్రసంగం (PM Narendra Modi Addresses Rally at Brigade Parade) ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో వందలాది ర్యాలీల్లో ప్రసంగించానని, తన సుదీర్ఘ ప్రస్థానంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తనను ఆదరించడం తానెన్నడూ చూడలేదని అన్నారు. మార్పు కోరుకుంటున్న బెంగాల్ ప్రజలు ఎప్పుడూ తమ ఆశలు వదులుకోలేదని, కోల్‌కతా, బెంగాల్ భారతదేశానికి స్ఫూర్తి కేంద్రాలని ప్రశంసించారు.
ఎనిమిది విడతలుగా జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27న తొలి దశ పోలింగ్‌తో మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ, సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటానికి ముందు బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ, మమత బెనర్జీ బెంగాల్‌కు చెందిన బిడ్డ కాదన్నారు. ఆమె చొరబాటుదారులు, రొహింగ్యాల అత్త అని దుయ్యబట్టారు. టీఎంసీ మళ్ళీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్ మరో కశ్మీరు అవుతుందన్నారు. కశ్మీరులో పండిట్లకు ఏం జరిగిందో, బెంగాలీలకు కూడా అదే జరుగుతుందన్నారు. టీఎంసీ, వామపక్షాలు-కాంగ్రెస్ కూటమి బుజ్జగింపు రాజకీయాలతో పశ్చిమ బెంగాల్‌ను విభజించాలనుకుంటున్నాయని మండిపడ్డారు.
బెంగాల్ తన సొంత బిడ్డను కోరుకుంటోంది’ అనే టీఎంసీ నినాదాన్ని ప్రస్తావిస్తూ, మమత బెనర్జీని ఎవరూ తమ సొంత బిడ్డగా అంగీకరించరని చెప్పారు. ఆమె చొరబాటుదారులు, రొహింగ్యాల అత్త అని వ్యాఖ్యానించారు. టీఎంసీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. టీఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ మమత బెనర్జీ అని, అవినీతిపరుడైన మేనల్లుడు టీఎంసీకి మేనేజింగ్ డైరెక్టర్ అని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చెల్లించి ఓ వ్యూహకర్తను తీసుకొచ్చారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజన పథకాల నిధులను దారి మళ్ళించి, బొగ్గు, ఇసుక, ఆవుల దొంగ రవాణా ద్వారా ఈ సొమ్మును సంపాదించారన్నారు.
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సభను నిర్వహిస్తుండగా, దానికి పోటీగా సీఎం మమత బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు. పెరిగిన ధరలు మోదీ దృష్టికి తీసుకురావడానికే తాము ఈ ర్యాలీని నిర్వహించామని, ప్రస్తుతం మోదీ బెంగాల్ పర్యటనలోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
పెట్రో, సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం మాటలు మాత్రమే చెబుతారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో మార్పు రావాలని మోదీ పదే పదే అంటారని, కేంద్రంలో పరివర్తన వస్తుందని, మోదీ కుర్చీ నుంచి గద్దె దిగుతారని ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌లో మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పరిస్థితులు బాగోలేవని విమర్శించారు.