World War 3 Fears Erupt: 3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?, ఇరాన్‌పై దాడితో అమెరికా లక్ష్యం నెరవేరిందా..?ప్రతీకార దాడి తప్పదన్న ఇరాన్, దాడికి ముందు అసలేం జరిగింది.?,బాగ్దాద్ విమానశ్రయ దాడిపై విశ్లేషణాత్మక కథనం
US President Donald Trump with Iranian counterpart Hassan Rouhani (Photo Credits: PTI)

Washington/Tehran, January 3: అమెరికా, (America) ఇరాన్ (Iran) దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాడులు, ప్రతి దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మూడవ ప్రపంచపు యుద్ధానికి (World War 3) దారులు తెరుచుకునేలా ఈ రెండు దేశాల వార్ నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ లాంచర్లతో (US Airstrikes)విరుచుకుపడింది. ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది.

మొత్తంగా మూడు రాకెట్‌ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్‌, ఇరాక్‌కు (Iraq) చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌,(Qassem Soleimani) ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌ మృతిచెందినట్టు ఇరాక్‌ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు.

దాడికి పాల్పడింది తామే : అమెరికా

బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్‌ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (Donal Trump)ఆదేశాలతో ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చినట్టు ఆ దేశ రక్షణ విభాగం(పెంటగాన్‌) వెల్లడించింది. ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సోలెమన్‌ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్‌ ఆరోపించింది.

Here's ANI Tweet

వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి సోలెమన్‌ బాధ్యుడని తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సోలెమన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అలాగే ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది. వైట్‌ హౌస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం

ఇదిలా ఉంటే బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్‌ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్‌ ఇరాక్‌కు ప్రత్యేక బలగాలు పంపించారు. సోలెమన్‌ను మట్టుబెట్టడంతో అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, సోలెమన్‌ సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రెండు ప్రత్యేక కాన్వాయ్‌లు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్నాయి. అయితే సోలెమన్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ దాడులు జరిగాయి.

Here'S ANI Tweet

అమెరికా జెండాను పోస్ట్‌ చేసిన ట్రంప్‌

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడిలో సోలెమన్‌ మృతి చెందిన కొద్దిసేపటికే డోనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో అమెరికా జాతీయ జెండాను పోస్ట్‌ చేశాడు. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోలెమన్‌ను మట్టుపెట్టడం ద్వారా అమెరికా విజయం సాధించిందని చెప్పేందుకు ఈ జెండాను పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు పరస్పర దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Here's Donald Trump Tweet

హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదు : ఇరాన్

బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్‌ దాడి జరపడాన్నిపిరికిపందలు, అవివేకంతో చేసిన చర్యగా ఇరాన్‌ అభివర్ణించింది. ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సోలెమన్‌ను చంపడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

US airstrike at Baghdad airport

ఇరాన్‌లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్‌ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్‌ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు.

సోలెమెన్ హత్యతో ఇరాక్ వీధుల్లో సంబరాలు

ఇదిలా ఉంటే సోలెమెన్ హత్య నేపథ్యంలో ఇరాక్ వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేకదారులు సంబరాలు జరుపుకుంటున్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాగ్దాద్ లో వారి ఆందోళనలకు వేదికగా మారిన తాహిర్ స్క్వేర్‌లో సంబరాలు జరుపుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరాక్ జాతీయ జాతీయ పతాకాలతో ఊరేగింపు నిర్వహించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Here's Tweet

ఖాసీం సోలెమన్‌ ఎవరు ?

ఈయన 1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పనిచేసినపుడు ఆయన మొదటిసారి వెలుగులోకి వచ్చారు. మేజర్ జనరల్ ఖాసీం సోలెమన్‌ 1998 నుంచి ఇరాన్ రివ్యూషనరీ గార్డ్స్‌లో (Islamic Revolutionary Guard Corps) అత్యున్నత విభాగం అయిన ఇరాన్ కుర్దుల దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ దళం విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జనరల్ ఖాసీం సోలెమన్‌ ఇరాన్ పాలనలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఆయన కుర్ద్ ఫోర్స్ తరఫున నేరుగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీకి మొత్తం సమాచారాన్ని రిపోర్ట్ చేస్తుంటారు.

ఖాసీం సోలెమన్‌ను పశ్చిమాసియాలో ఇరాన్ కార్యకలాపాలు నిర్వహించడంలో వ్యూహకర్తగా భావిస్తారు. 2003లో అమెరికా సైనిక దాడుల్లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైన తర్వాత పశ్చిమాసియాలో కుర్దుల సేన తమ కార్యకలాపాలు వేగవంతం చేసింది. దీంతో గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సహా కుర్దు దళాలను విదేశీ తీవ్రవాద సంస్థలుగా ఖరారు చేశారు.

దాడులు-ప్రతి దాడులు

ఇరాక్‌లో ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై అమెరికా ఇటీవల వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 25 మంది మిలిటెంట్లు చనిపోయారు. ఇరాక్‌లోని కిర్కుక్‌లో తమ సైనిక స్థావరాలపై జరిగిన దాడికి సమాధానంగా ఈ దాడులు జరిపినట్లు అమెరికా చెప్పింది. అమెరికా దాడుల్లో మృతిచెందిన మిలిటెంట్ల అత్యక్రియల తర్వాత ఆగ్రహించిన ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. వేల సంఖ్యలో బగ్దాద్ గ్రీన్ జోన్ ప్రాంతం వైపు కదిలారు.

వీరిలో అబూ మహదీ అల్-ముహాదిస్‌తో పాటు హిజ్బుల్లాహ్‌కు చెందిన ఎంతోమంది సీనియర్ సైనికాధికారులు ఉన్నారు. బగ్దాద్ గ్రీన్ జోన్ ప్రాంతంలో ఇరాక్‌కు చెందిన కీలక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలాలు ఉన్నాయి. ఇరాక్ భద్రతా దళాలు ఆందోళనకారులను గ్రీన్ జోన్‌లోకి రావడానికి అనుమతించాయి. దాంతో, కాసేపట్లోనే ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయం ముందు గుమిగూడారు. ఆందోళనకారులు కతాయిబ్ హిజ్బుల్లా, మిగతా గ్రూపుల జెండాలు ఎగరేస్తూ, అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు.

అమెరికా ఏంబసీ చుట్టుపక్కల ప్రధాన ప్రవేశ మార్గాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సెక్యూరిటీ కెమెరాలు విరగ్గొట్టారు. ఖాళీగా ఉన్న సెక్యూరిటీ పోస్టులకు నిప్పుపెట్టారు. నిరసనకారులు ప్రహరీ గోడ దూకి లోపలికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అమెరికా సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఆందోళనకారులు ఏంబసీ ప్రహరీ గోడ దూకి లోపలకి చొచ్చుకొచ్చారు.

బయట ఒక సెక్యూరిటీ పోస్టుకు నిప్పు పెట్టారు. ఈ దాడి వెనుక ఇరాన్ ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. దాడికి పూర్తి బాధ్యత ఇరాన్‌దే అన్నారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా ఇరాన్ ను హెచ్చరించింది.అనుకున్నట్లుగానే బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ దాడులు చేసి కీలక సైన్యాధికారులను అంతమొందించింది.

ముందు ముందు ఈ దాడులు మూడవ ప్రపంచపు యుద్దానికి బాటలు పరిచినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.