Sabarimala Issue: మళ్లీ లైవ్‌లోకి వచ్చిన సేవ్ శబరిమల వివాదం, మహిళలను అనుమతించాల్సిందేనన్న సుప్రీంకోర్టు, రాజకీయ రంగు పులుముకుంటున్న అయ్యప్ప టెంపుల్, కోర్టు తీర్పును గౌరవిస్తామన్న కేరళ సీఎం
What happened in Kerala after the SC verdict ( photo-PTI)

Kerala,September 28: శబరిమల మళ్లీ రాజకీయ రంగు పులుముకునేందుకు సిద్ధమైంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మళ్లీ సేవ్ శబరిమల (Save Sabarimala)నినాదం తెరమీదకు వచ్చింది. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో ఈ అంశాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. #SaveOurSabarimala పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అందరూ నిరసన తెలుపుతున్నారు. హిందూ సంప్రదాయాలను ఎందుకు బ్రేక్ చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా అందరూ గళమెత్తుతున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారబోతుందని తెలుస్తోంది. బిజెపి, కమ్యూనిస్ట్ పార్టీలు తమ రాజకీయ అస్త్రాలుగా దీనిని మార్చుకోనున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము సవాలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.

ట్విట్టర్లో ట్రోల్ అవుతున్న #SaveOurSabarimala

మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అంతిమమని, దానిని అమలు చేయటం తప్ప ప్రభుత్వానికి మార్గాంతరం లేదని అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించేందుకు వీలుగా తమ ప్రభుత్వంఏర్పాట్లు చేస్తుందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పినందున అదే ప్రస్తుతం చట్టం అవుతుందని ఆయన అన్నారు. ఈ ఏడాది శబరిమల సీజన్‌ నుండి ఆలయ ప్రవేశం కోరుకునే మహిళలందరూ ఈ ఆలయాన్ని సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తామని కేరళ సీఎం తెలిపారు. వారి భద్రత కోసం మరికొంత మంది మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని, రాష్ట్రంలోని మహిళా పోలీసులు చాలకపోతే ఇతర రాష్ట్రాల నుండి రప్పించుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఏ విధంగా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు.

వ్యతిరేకిస్తున్నకేరళ బిజెపి

ఇదిలా వుండగా మహిళలను ఆలయంలోపలికి అనుమతించకుండా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసేందుకు కేరళ బిజెపి సిద్ధమవుతోంది. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆలయ నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ట్రావెంకూర్‌ దేవస్వామ్‌ బోర్డుకు కాంగ్రెస్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్వహణా వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తున్న పందళ రాజవంశీకులు కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసే అంశంపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న వారు ఎంతమంది వున్నారో, స్వాగతిస్తున్న వారు అంతకు రెట్టింపు సంఖ్యలో వున్నారని విజయన్‌ మీడియాకు చెప్పారు. టికెఎ నాయర్‌ వంటి భక్తులు, సాధు సంతులు సైతం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారని, ఆలయ ప్రవేశంపై ఆసక్తి చూపే మహిళలను అనుమతించాలని చెబుతున్నారని ఆయన వివరించారు.

ట్విట్టర్లో ట్రోల్ అవుతున్న #SaveOurSabarimala

ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దించిన దేవస్థానం బోర్డు

ఈ అంశం ఇలా నడుస్తుంటే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేయరాదన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని ట్రావెంకూర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ కొచ్చిలో మీడియాతో మాట్లాడుతూ తీర్పును నిశితంగా పరిశీలించిన అనంతరం రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని యధాతథంగా అమలు జరపాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రుతుక్రమంలో వున్న మహిళలను ఆయ్యప్ప ఆలయంలోకి అనుమతించరాదన్న శతాబ్దాల సంప్రదాయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు అమలుకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు తమను ప్రశ్నించిందని, ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించిందని, తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయరాదని కూడా నిర్ణయించామని ఆయన చెప్పారు.