Ayodhya Deadline: తుది దశలో రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసు విచారణ,  రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్,  నవంబర్ 17న తుది తీర్పు, గత విషయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..
Section 144 Imposed In Ayodhya As Supreme Court Nears Verdict In Case (Photo-PTI)

New Delhi, October 14:  దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది. అక్టోబరు 17 లోపు ఇరువర్గాలు వాదనలు వినిపించడం పూర్తిచేయాలని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కోర్టుకు దసరా సెలవులు రావడంతో విచారణకు విరామం వచ్చింది. ఇప్పుడు వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణ షురూ కానుంది. నేటి నుంచి సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగనుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అయోధ్యలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దసరా సెలవుల అనంతరం ఈరోజు 38వ రోజు విచారణ ప్రారంభమవుతుంది. మధ్యవర్తిత్వం విఫలమైన నేపధ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి కేసు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయించింది. మరుసటి రోజు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అదే రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ కూడా చేయనున్నారు. అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరడం, తీర్పు వెలువడనుండడంతో ఆంక్షలు విధించామని, డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందంటున్న ఏఐఎంపీఎల్‌బీ

అయోధ్య రామ జన్మ భూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌బీ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాజీ ప్రసక్తే లేదని తెలిపింది. రామాలయాన్ని కూల్చిన తర్వాత బాబ్రీ మసీదును నిర్మించలేదని పేర్కొంది.ఏఐఎంపీఎల్‌బీ చైర్మన్ రబీ హసన్ నడ్వీ అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. బాబ్రీ మసీదుకు చెందిన భూమిని ఎదుటి పక్షంలోని ఎవరికి అయినా బదిలీ చేయరాదని నిర్ణయించినట్లు ఏఐఎంపీఎల్‌బీ ప్రకటించింది. లీగల్ ప్రొసీడింగ్స్ తుది దశలో ఉన్నాయని, కోర్టు వెలుపల పరిష్కారానికి అవకాశం లేదని పేర్కొంది. ముస్లిం పార్టీల తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ వినిపిస్తున్న వాదనలపై సంతృప్తి వ్యక్తం చేసింది.

అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం

కాగా అయోధ్యపై సుప్రీం తీర్పుతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న నేపథ్యంలో డిసెంబరు 10వతేదీ వరకు అయోధ్య నగరంలో 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పౌరుల భద్రత కోసం 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామని కలెక్టరు పేర్కొన్నారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు. అయోధ్యలో నలుగురి కంటే ఎక్కువమంది గుమిగుడితే అల్లర్లు జరుగుతాయని ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు ప్రకటించారు.

144 Section in Ayodhya

అసలేంటి అయోధ్య భూవివాదం కేసు ?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ఓ నగరమైన అయోధ్యలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసుగా దీన్ని చెప్పవచ్చు. అక్కడ రాముడి జన్మస్థలంతో పాటు బాబ్రీ మసీదు కూడా ఉందని స్థల సందర్శనకు అనుమతించాలన్నదే కేసు ప్రధాన అంశంగా తెలుస్తోంది. ఇక్కడ మసీదును నిర్మించటానికి అంతకుముందు ఉండిన హిందూ దేవాలయాన్ని కూల్చివేయటం లేదా మార్చివేశారంటూ కోర్టులో కేసు నడుస్తోంది. కాగా బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించి, అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు. దీంతో పాటుగా ఇటువంటి సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో కోర్టు తన ఉత్తర్వులో వివరించింది. ఈ తీర్పు సారాశం ఏంటంటే ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని మేం శుభ్రం చేయాల్సి ఉంది.

శతాబ్ద కాలానికి పైగా వివాదం

రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. ఆ స్థలం మాది అని హిందువులు వాదిస్తున్నారు. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం దాన్ని ఆక్రమించాడని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుని నిర్మించాడని చెబుతున్నారు. అయితే ముస్లీంలు మాత్రం ఆ స్థలం మాదేనని 1949 వరకూ మేము అక్కడ ప్రార్థనలు చేశామని అదే ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాతే హిందువులు పూజించటం ప్రారంభించారని చెబుతున్నారు. ఇలా నాలుగు దశాబ్దాల పాటు అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. కోర్టు చుట్టూ ఈ కేసు తిరుగుతూనే ఉంది.

మరింతగా ముదిరిన వివాదం

అయితే, 1992లో హిందువుల గ్రూపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. 1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రధర్శణలు నిర్వహించారు, ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో తర్వాత జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. దీంతో పాటుగా కొంతమంది హిందూ కార్యకర్తలు కూడా చనిపోయారు. దీంతో వివాదం మరింతగా ముదిరిపోయింది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు 2010లో దీనిపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ధర్మాసనంలో ఉన్న ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.