Chennai, October 1: భారత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరుగుతుందని చెన్నై పోలీస్ కంట్రోల్ రూంకు వచ్చిన ఓ ఫోన్ కాల్ పోలీసులను కంగారు పెట్టింది. విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సోమవారం ప్రధాని మోదీ చెన్నైలో పర్యటించిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో సిటీ పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమై ఆ ఫోన్ కాల్ వచ్చిన ఏరియాను ట్రేస్ చేసి, ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి కోసం గాలించారు, ఆ వ్యక్తి వివరాలు, అతడికి గతంలో నేరప్రవృత్తి ఏమైనా ఉందా అనే విషయాలన్నీ ఆరాతీశారు. ఇదే సమయంలో అన్నీ ఏరియాలలో పెట్రోలింగ్ నిర్వహించారు, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. అందులో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగా మోదీని హతమార్చనున్నట్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిపి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, నగరంలోని తిరువాన్మియూరు ప్రాంతం నుండి ఫోన్ కాల్ వచ్చినట్లుగా గుర్తించారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తిరునావుక్కరసుగా గుర్తించిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 'మోదీ హత్యకు కుట్ర' అంతా బూటకం అని తేలింది. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుడి గురించి పోలీసులు స్థానికంగా ఆరా తీయగా, అతడు ఎలాంటి పనీ-పాట లేకుండా జులాయిగా తిరుగుతుంటాడని తెలిసింది.