ShivSena Manifesto 2019: రూపాయికే వైద్యం, 10 రూపాయిలకే భోజనం, ఊరిస్తున్న శివసేన మేనిఫేస్టో, మహారాష్ట్రలో ఈ నెల 21న మోగనున్న ఎన్నికల నగారా
ShivSena releases poll manifesto promises reduction in power tariff (Photo-Twitter)

Mumbai, October 12:  మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీల మధ్య రాజకీయ వార్ మరింతగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పార్టీ శివసేన తన మేనిఫేస్టోని విడుదల చేసింది. మేనిఫేస్టోలో శివసేన పార్టీ ప్రజలకు హామీల వర్షం కురిపించింది. అనేక ప్రజాకర్షక, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువచ్చింది. వచన్ నామా' పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే విడుదల చేశారు. మహిళా విద్య, యువత, విద్యుత్ టారిఫ్‌లు, వ్యవసాయ ఉత్పాదకత తదితర అంశాలపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టి సారించింది. ఈ మేనిఫేస్టోలో బడుగులకు, బలహీన వర్గాలకు పెద్ద పీఠవేశారు.

శివసేన మేనిఫేస్టో విడుదల

ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు, పేదలకు అందుబాటులో వైద్యం, రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు, వాటిలో రూ.10కే భోజనం, 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడకంపై 30 శాతం రాయితీ, మరాఠీలో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకున్న 10, ప్లస్ టూ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ, యువతకు రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కాలేజీల వరకు ప్రత్యేక బస్సులు వంటివి శివసేన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం , ముంబైలో మడ అడవుల డెవలప్ మెంట్ వంటి వాటిని మేనిఫేస్టోలో పొందుపరిచారు. ఇవేకాకుండా రైతులకు ఊరట కలిగించేలా ఐదేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయబోరట. ఇప్పుడున్న ధరలనే వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

ప్రచారంలో శివసేన

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దాదాపు 15 పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ ల మధ్యనే ఉంది.

ఇదిలా ఉంటే శివసేన కార్పొరేటర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. సీట్ల పంపకాల అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్‌–డోంబివలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. శివసేన అధ్యక్షులు ఉద్దవ్‌ ఠాక్రేకు తమ రాజీనామా పత్రాలను పంపించారు. ఈ సంఘటన శివసేనతోపాటు బీజేపీకి తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే థానే జిల్లాలో శివసేనకు బాగా పట్టుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపండం కొంచెం ఊరట కలిగించే అంశం.