Hyderabad, September 8: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియామకమైన తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎస్ చౌహన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకమైన బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కేటీఆర్, హరీశ్ రావు, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ చేరుకున్న తమిళిసై సౌందరరాజన్, అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ప్రముఖులు తమిళిసైకి, ఆమె కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టులోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆమె రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహ మరికొంత మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. వారందరూ ఈ సాయంత్రం నూతన గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.