Bengaluru, October 19: దేశంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. మినీ సార్వత్రిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు తమ పంజాను విసిరేందుకు కాచుకూర్చున్నారని అనధికార రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలకు కర్ణాటక హోంమంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ బలాన్ని ఇస్తోంది. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ చురుగ్గా ఉన్నాయని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. కర్ణాటక తీరం, బంగాళాఖాతం వెంబడి అవి తమ కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేశాయని ఆయన మైసూరులో విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా ఉగ్రవాద స్లీపర్ సెల్స్ జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందినవిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానిస్తోందని ఆయన అన్నారు.
బెంగళూరు, మైసూరుల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్త తీసుకోమని ఎన్‌ఐఏ సూచించిందన్నారు. కోస్టల్, ఇంటీరియర్ కర్ణాటకలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జేఎంబీ కార్యకలాపాలు విస్తరించిందని బొమ్మై హెచ్చరించారు.ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చెకింగ్ ముమ్మరం చేశారు.
మీడియా సమావేశంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై
Karnataka Home Minister Basavaraj Bommai: NIA has said Bengaluru and Mysuru are becoming a hub of Jamaat-ul-Mujahideen Bangladesh ultras. Our cops are taking all precautionary measures. Their movement has intensified in coastal Karnataka as well as interior Karnataka. (File pic) pic.twitter.com/b1F5MTOhyg
— ANI (@ANI) October 18, 2019
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అక్రమ బంగ్లాదేశీ వలసదారులు కూడా కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్నారన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్).. ఎన్‌ఐఏతో కలసి పనిచేస్తుందని, వచ్చే నవంబర్ 1 నుంచి పని చేయడం మొదలుపెడుతుందని ఆయన తెలిపారు. జేఎంబీ బృందాలు తమిళనాడులోని క్రిష్ణగిరి కొండల ప్రాంతాల్లో శిక్షణ పొందాయని, అక్కడ స్థావరం ఏర్పరుచుకుని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాలని చూశాయని ఎన్‌ఐఏ తెలిపింది. జేఎంబీ జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో విస్తరించిందని న్యూఢిల్లీలో జరిగిన ఏటీఎస్ సమావేశంలో ఎన్‌ఐఏ చీఫ్ వైసీ మోడీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తన కోరలు విస్తరించాలని జేఎంబీ చూస్తోందని, ఇప్పటికే 125 మంది అనుమానితుల జాబితాను రాష్ట్రాలకు అందించామన్నారు. జేఎంబీ గ్రూప్ 2014 నుంచి 2018 మధ్య బెంగళూరులో 22 రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుందని తెలిపారు.
కాగా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాయాది దేశం నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు అందుతున్నాయి. అక్కడి నుంచి ఉగ్రవాదులు ఇండియాకు తీర ప్రాంతాలు ద్వారా ఇండియాకు చేరుకుని తమ పంజాను విసిరేందుకు రెడీ అయినట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది.