New Delhi, Mar 02: మార్చి 11 నుంచి తలపెట్టిన 3 రోజుల బ్యాంకుల సమ్మెను (Bank strike) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. ఉద్యోగుల జీతాలు 15 శాతానికి పెంచడంతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
జీతాలు పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) (Indian Banks' Association (IBA) అంగీకరించిందని, పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా (Bank Strike Deferred) వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధికారులు తెలిపారు.
ఐదు రోజుల పనిదినాలు తప్ప ఫ్యామిలీ పెన్షన్ దగ్గర్నుంచి అన్ని ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో సమ్మె వాయిదా వేసి చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. కాగా వేతన సవరణ కోసం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభుత్వం దిగిరాకుంటే మార్చి 11 నుంచి మూడు రోజులు, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేసేందుకు యూనియన్లు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన సంగతి విదితమే.
శనివారం యూనియన్లతో ఐబీఏ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఈ 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐబీఏ ప్రతిపాదనలను పరిశీలించి వారం తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నేతలు వివరించారు.