Tirumala Update(TTD)

Tirumala, July 19: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలుత ప్రముఖ హిందూ దేవాలయం తిరుమల పై ప్రత్యేక దృష్టి సారించింది. ఓ రకంగా చెప్పాలంటే ఆపరేషన్ తిరుమల కార్యక్రమంతో ముందుకు వెళ్తొంది. ఇందులో భాగంగా తొలుత ఈవోగా శ్యామలారావును నియమించారు సీఎం చంద్రబాబు. ఇక ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస రివ్యూలు, లడ్డూ నాణ్యత, ఉచిత అన్నదాన సత్రాల తనిఖీలు ఇలా ప్రతిరోజు ఓ కార్యక్రమంతో భక్తుల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఈవో శ్యామలరావు.

తాజాగా ఎఫ్‌ఎస్‌డీ అధికారులతో కలిసి తిరుమలలోని హోటల్స్‌ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈవో. నాసిరకం కూరగాయలు, సరుకులను గుర్తించారు. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్‌పై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తారని వారి ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.

తిరుమలలోని హోటల్స్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేశారని దీంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా ఇది నిజమేనని తేలిందన్నారు. అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి హోటల్స్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం తనిఖీ చేసిన హోటల్‌లో వంటగదిని మూసివేసిన అధికారులు విచారణ తర్వాత తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల హోటల్స్‌లో ఫుడ్‌ని చెక్ చేసేందుకు మొబైల్ ల్యాబ్‌ని ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను చెక్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం ,ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్..శ్రీవారి సన్నిధిలో గడ్కరీ

ఇక తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఇకపై ఆన్‌లైన్‌లో 500 టికెట్లు, ఆఫ్‌ లైన్‌లో 1000 టికెట్లను జారీ చేయనున్నారు.