ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే (Eye Blinking) కష్టాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే, మంచి చెడులను తెలియజేయడానికే కన్ను కొట్టుకుంటుందా లేదా శరీరంలో ఏదైనా సమస్య వల్లా అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి.కంటి రెప్పలోని కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు కన్ను (Right and Left Eye Blinking) కొట్టుకుంటుంది. ఇది ఎక్కువగా పైరెప్పలోనే ఏర్పడుతుంది. కొందరికి కింద, పైరెప్పల్లో కూడా కలుగుతుంది.
ఆడవారికి కుడి కన్ను అదిరితే (Right Eye Blinking Astrology) లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని చెప్తున్నారు. చైనీయులదైతే మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారు మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు.
కన్ను అదరడం శుభసూచకమా? లేదా కీడును తెలియజేస్తుందా? దీని వెనక వాస్తవాలు ఏంటి? సైన్స్ ఏం చెబుతుంది?
హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు. ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు.
చైనా కంటి శాస్త్రం ప్రకారం.. ఎడమ కన్ను (Left Eye Blinking Astrology) అయితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేది ఏదో జరుగుతుంది, కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తారు. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీరు త్వరలో కొంత ధనం కోల్పోతారు, విదేశాల నుంచి అతిథులు వస్తారట. కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉదయం 11 నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట.ఇలా చాలా లెక్కలున్నాయి వారికి!
ఏదైతేనేం.. కన్నుశాస్త్రం ప్రకారం ఎక్కువ సేవు అలా కళ్లు అదురుతుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందట. కానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్లే కాకుండా, నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్నా అలా కళ్లు అదురుతాయట. కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్లు అలా అదురుతుంటే వెంటనే సంబంధిత వైద్యులను కలవడం ఉత్తమం.
అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి! అని కూడా కొందరు వాదిస్తున్నారు.
కన్ను అదరడానికి గల కారణాలు పరిశీలిస్తే..
కాఫీ- టీలు ఎక్కువగా తాగటం: మీకు ఈ కన్ను అదిరితే ఒకటి గమనించండి. మీరు ఆరోజు లేదా అంతకు ముందు కెఫీన్ సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకొని ఉంటారు. మీకు తెలిసో, తెలియకుండానో కాఫీలు లేదా టీలు ఎక్కువగా తాగిస్తే దానిలోని కెఫీన్ నేరుగా నాడీవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. తద్వార కంటికి సంబంధించిన ఈ కదలికలు వస్తాయి. ఈ కాఫీ- టీలు తగ్గిస్తే, ఈ అదరడాన్ని తగ్గించవచ్చు.
కళ్లపై భారం మోపడం: రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తే, తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూడటం లేదా మొబైల్ చూస్తూ ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం ద్వారా కళ్లపై చాలా భారం పడుతుంది. దీనివల్ల కళ్లు సంకోచానికి గురవుతాయి. ఇది కేవలం కన్ను అదరటమే కాకుండా, కళ్లు మిటకరించటం, రెటినా దెబ్బతినటం లాంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.
ఒకవేళ మీరు రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటే మధ్యమధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటూ ఉండండి, ఉన్నచోటనే అప్పుడప్పుడూ 3 నుంచి 5 నిమిషాలు కళ్లు మూసుకొని కళ్లకు కొంత విశ్రాంతినిస్తూ పోయినా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
నిద్రలేమి, అలసట: మీకు ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తి సంబంధమైన కారణాల ద్వారా నిద్రలేమి, అలసట లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే కన్ను అదరడం జరుగుతుంది. కంటికి సరైన నిద్ర, విశ్రాంతి చాలా అవసరం అదే మిమ్మల్ని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నిద్రలేమితో బాధపడేవారు సమయం దొరికినప్పుడల్లా చిన్నపాటి కునుకు తీస్తే సమస్యను దూరం చేసుకోవచ్చు.
అలెర్జీలు: శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి, మరియు దగ్గు, పడిశంతో జ్వరం ఉన్నవారికి కూడా కళ్ల సంకోచాన్ని గుర్తించవచ్చు.
ఈ కంటి సంకోచాలకు సంబంధించి ఎలాంటి మెడిసిన్ అవసరం లేకపోయినా ఇది శరీరంలో మెదడు- నాడీవ్యవస్థకు తలెత్తిన లోపాలను సూచిస్తుంది, వాటిని ఎప్పటికప్పుడు సవరించుకోవడం మంచిది. అలాగే కొన్నిసార్లు రెండు కళ్లలో ఈ కదలికలు లేదా శరీరంలో ఏదైనా భాగంలోని కండరాలలో ఈ జర్క్ లు లేదా సంకోచాలు గమనిస్తే అవి టోరెట్ సిండ్రోమ్ మరియు బెల్స్ పల్సీ లాంటి రుగ్మతలను తెలియజేస్తుంది. డాక్టర్స్ ను సంప్రదించి సరైన హెల్త్ కేర్ తీసుకోవడం మంచిది.