Velagapudi Violence (Photo-Video Grab)

Amaravati, Dec 28: అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తుళ్లూరు మండలం ( Thullur) వెలగపూడిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు (Velagapudi Violence) దారి తీసింది. ఎస్సీ కాలనీలో ఇటీవల నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారానికి ఏ నేత పేరు పెట్టాలనే విషయంపై ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు.

జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మృతదేహంతో రహదారిపై ధర్నాకు దిగారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు (Bapatla MP Nandigam Suresh) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

మేడ్చల్ జిల్లాలో దారుణం, ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, యశోదాలో చికిత్సపొందుతున్న సీఐ భిక్షపతి

పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత (Home Minister Mekatoti Sucharitha), ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడినవారిని పరామర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు.

వెలగపూడిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను భారీగా మోహరించారు. ఈ ప్రాంతంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వెలగపూడి ఘటన దురదృష్టకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. మరియమ్మ మృతి బాధాకరమని ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పికెట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తక్షణ సాయంగా మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ వద్దకు తీసుకెళ్తామని అన్నారు.