Kutch, February 18: స్త్రీని దేవత కొలిచే దేశంలో అదే స్త్రీ పట్ల వివక్ష, ఆమెపై దాడులు, కొన్ని సందర్భాలలో మూఢనమ్మకాలతో ఆమెను ఇబ్బంది పెట్టే అనాగరికమైన చర్యలు నేటికీ కొనసాగుతున్నాయి. పెళ్లికాని లేదా గర్భవతి కాని యువతుల్లో పీరియడ్స్ రావడం అనేది సహజం, సాధారణ విషయం. నేటి యుగంలో కూడా రుతుస్రావంలో (menstruation) ఉన్న స్త్రీలను (Women) దూరం పెట్టడం, ఆ సమయంలో వారెదో అపవిత్రం అయినట్లు వివిధ రకాల జాఢ్యాలను వారిపై ప్రదర్శించటం దేశంలో చాలా చోట్ల సర్వసాధారణమైపోయింది. తాజాగా, ఒక ఆధ్యాత్మిక గురువు చేసిన కమెంట్స్ విస్మయానికి గురిచేస్తున్నాయి.
రుతుస్రావం (Periods) అయిన స్త్రీ ఆహారం వండితే, ఆమె తదుపరి అవతారం "కుత్రి" అంటే వేశ్యగా మారుతుంది అని గుజరాత్ రాష్ట్రం భుజ్ (Bhuj) పట్టణంలోని స్వామినారాయణ్ మందిరానికి చెందిన ఆధ్యాత్మిక గురువు కృష్ణ స్వరూప్ దాస్‌జీ (Swami Krushnaswarup Dasji) షాకింగ్ కమెంట్స్ చేశారు. అంతేకాదు అలాంటి సమయాల్లో స్త్రీ వండిన ఆహారాన్ని ఆమె భర్త గనుక తింటే అతడు తన తర్వాత జన్మలో "ఎద్దు" గా పుడతారని స్వామిజీ సెలవిచ్చారు.
ఇలా చెబితే తన మాటలు కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం, దీనిపై పురాణ శాస్త్రాలలో వివరించబడ్డాయని అయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అలాగే స్త్రీలు ఇలా ధర్మాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉండేందుకు పురుషులకు వంట చేయడం నేర్చుకోవాలి, తమ ఇంట్లోని స్త్రీలు ధర్మాన్ని పాటించేలా మీరే చూసుకోవాలి అని పేర్కొన్నారు.
గుజరాత్ లోని ఓ మహిళా కళాశాలలో పీరియడ్స్ లో ఉన్న విద్యార్థినుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే, ఆ ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి అనారికమైన వ్యాఖ్యలను తాజాగా కృష్ణ స్వరూప చేశారు.
భుజ్‌లోని సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ (SSGI- Shree Sahajanand Girls Institute) లో పీరియడ్స్ లో ఉన్న విద్యార్థినులు తరగతులకు కూడా హాజరు కావొద్దని నిషేధం విధించారు. ఆ నిబంధనలు పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు గత వారం ఫిబ్రవరి 13న బలవంతంగా సుమారు 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పి మరీ తనిఖీలు నిర్వహించారు.