
హైదరాబాద్ నగరం మొత్తం జై బోలో గణేష్ మహరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయక ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది.
కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. ఎన్నడూ లేని విధంగా ఇంత ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా ఇక్కడి గణపతి లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర పలికింది. పోయిన సంవత్సరం రూ. 60.80 లక్షలు పలకగా... ఈ ఏడాది రెండింతలు ఎక్కువ ధర పలికింది.
ఈ సారి బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి వేలంపాటలో లడ్డూ సొంతం చేసుకున్నారు. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది.
గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డు. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట తర్వాతే నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో శ్రీ సీతారామాంజనేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వేలం పాటలో వినాయకుడి లడ్డూ రూ. 1,02,116 ధర పలికింది. అదే గ్రామానికి చెందిన వర్కాల రాజకుమార్ వేలం పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నాడు. మరో భక్తుడు కంకల కృష్ణ రూ.25,116 లకు పాట పాడి వినాయకుడి శాలువాను దక్కించుకున్నారు.
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.