Ganesh Immersion (PIC@ X)

Hyderabad, SEP 28: గణేష్ మహా నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో మహా నిమజ్జనానికి పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేసింది. అలాగే జీహెచ్ఎంసీలో మరో 100 చోట్ల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ తోపాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది కోలాహలంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టం (Ganesh Immersion) జరుగనుంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్ (Cyberabad), రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం (Ganesh Immersion) పూర్తయ్యేవరకు అంటే దాదాపు 36 గంటలపాటు పోలీసులు విధుల్లో ఉండనున్నారు. బంజారాహిల్స్ లోని సిటీ కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. వివిధ శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన జంక్షన్లలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోపాటు పారా మిలిటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.

 

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 26 వేల 694 మందితోపాటు 125 ప్లాటూన్ల స్పెషల్ ఫోర్స్ ను బందోబస్తుకు నియమించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ఇక వీటితోపాటు ఆర్ఏఎఫ్ ఫోర్స్, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్, షీ టీమ్స్ తో పాటు, 5 డ్రోన్ టీమ్ లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల మేర ప్రధాన నిమజ్జన ర్యాలీ ఉంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్, ఆర్డీఏ, మెడికల్ తదితర విభాగాలతోపాటు కలిపి పూర్తిస్థాయిలో ఉమ్మడి కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందన్నారు. సీపీతోపాటు నగర అదనపు సీపీ, ట్రాఫిక్ డీసీపీ సుధీర్ బాబు, జాయింట్ సీపీ విశ్వప్రసాద్ పర్యవేక్షించనున్నారు.

 

ఇక, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిమజ్జనానికి 6 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో 1000 మంది అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సరూర్ నగర్, రాంపల్లి, సఫిల్ గూడ, కాప్రా, నల్ల చెరువు, ఎదులబాద్ చెరువులు ప్రధానమైనవని తెలిపారు. హుస్సేన్ సాగర్ తర్వాత సరూర్ నగర్ కు భారీ స్థాయిలో విగ్రహాలు వస్తాయని వివరించారు. సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుందని కమిషనరేట్ కార్యాలయం ఉప్పల్, ఎల్ బీ నగర్ లోని సీపీ క్యాంప్ కార్యాలయాల్లో కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామన్నారు.