Dhanteras 2020: ధనత్రయోదశి అంటే బంగారం కొనుగోలు చేయడమే కాదు, దాని అసలు విశిష్టత మరొకటి ఉంది, కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి
Happy Dhanvantari Jayanti (File Image)

Dhana Trayodashi 2020: ఈరోజు ధనత్రయోదశి పర్వదినం, దీనినే ఉత్తర భారతదేశంలో ధంతేరాస్ పేరుతో జరుపుకుంటారు. దీపావళి పండుగ రాకను ఇది తెలియజేస్తుంది, ఈ ఏడాది నవంబర్ 13న మనం ధనత్రయోదశిని జరుపుకుంటున్నాము. ఈరోజును కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడం అనేది గత కొన్నేళ్లుగా సాంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి పూజలు చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ ఇంట్లో కొలువుదీరుతారని చాలా మంది హిందువులు విశ్వసిస్తారు. అందుకే తమ స్తోమతకు తగినట్లుగా బంగారు, వెండి ఆభరణాలు లేదా వంట పాత్రలు కొనుగోలు చేయడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, సంపద పెరుగుతుందని ప్రజల నమ్మకం.

అయితే ప్రజల నమ్మకం ఎలా ఉన్నా, ఈ పర్వదినానికి ఉన్న అసలు విశిష్టత మరిచిపోతున్నారనేది కాదనలేని వాస్తవం.

అసలు ధన త్రయోదశి అంటే ఏంటి? హిందూ పురాణ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అనేది ఒకసారి తెలుసుకుంటే.. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. ధన్వంతరి అంటే మహా విష్ణువు యొక్క 12వ అవతారం, పురణాల ప్రకారం దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మహా విష్ణువు ఒకసారి కూర్మ (తాబేలు) అవతారంలో కనిపించగా, మరోసారి ధన్వంతరి రూపంలో , చేతిలో రాగి కలశం అందులో కషాయంతో ఉద్భవిస్తాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

ఈ ధన్వంతరి నారాయణున్నే ఆయుర్వేదం ఆయుర్వేద పితామహుడుగా, వైద్యుల దేవుడిగా చెప్తారు.   సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే దేవుడిగా ధన్వంతరిని దేవతలు కొలిచేవారని పురాణాలు చెబుతున్నాయి.

ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నేటి సమాజం పూర్తిగా మరిచిపోయిన విషయం ఏమిటంటే.. ధన్వంతరి తన చేతిలో రాగి కలశంతో ఉద్భవించిన మూలానా, ఈరోజున రాగి వస్తువులను సంపాదించుకోవడం నుంచి అది క్రమక్రమంగా బంగారు, వెండి వస్తువులు కొనుగోలు చేసేవరకు వచ్చింది. కానీ, మన పూర్వీకులు చెప్పిన అద్భుత వాక్యం 'ఆరోగ్యమే మహాభాగ్యం'. అంటే ఆరోగ్యాన్ని మించిన అదృష్టం, సంపద ఈ సృష్టిలో మరొకటి లేదని దాని అర్థం. కాని ఇప్పుడు అది మరిచిపోయి, ఆరోగ్యాన్ని విస్మరించి, ప్రాథమిక అవసరం కాని బంగారు, వెండి, రాగి లాంటి వస్తువులు కొనుగోలు చేయడానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంటే దీని అర్థం ఈరోజుకున్న అసలు విశిష్టతను తప్పుదారి పట్టించడమే.

Happy Dhanvantari

భారత ప్రభుత్వం ఈ ధన్వంతరి త్రయోదశిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించింది. కాని నేడు భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది. ఈసారి దీపావళిని నవంబర్ 14న జరుపుకుంటారు, ఇది ప్రపంచ మధుమేహ దినోత్సవం కూడా, దేశంలో ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. దీనంతటికి మనం మన ఆరోగ్యం మీద కంటే డబ్బు, సంపదకే ప్రాధానం ఇవ్వడం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే మూలకారణం. దీపావళికి మీ ఇంటి ముందు ప్రత్యేకమైన రంగవల్లులను వేసుకోవటానికి సులభమైన రంగోలి డిజైన్స్ చూడండి

ధన త్రయోదశిని  దాని నిజమైన అర్థంలో జరుపుకోవాలి, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య కరోనావైరస్. ఈ కరోనా మహామ్మారిని అంతం చేసే విరుగుడు కోసం ప్రపంచం ఆత్రంగా ఎదురుచూస్తుంది, మరి మన ధనత్రయోదశి ఆ మహమ్మారిని అంతం చేసే విరుగుడును అందించి, మనందరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున ధన త్రయోదశి శుభాకాంక్షలు.