Lord Shiva (Photo Credits: Pixabay)

భోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు. హిందువులందరూ ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో మహా శివరాత్రి (Maha Shivratri 2022 Date, Significance and History) ఒకటి. మహా శివరాత్రి అంటే శివునికి అత్యంత ఇష్టమైన రోజు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

దృక్ పంచాంగ్ ప్రకారం, ఇది మాఘ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. చాంద్రమాన హిందూ క్యాలెండర్‌లో ప్రతి నెల శివరాత్రి పండుగ వస్తుంది. అయితే, మహా శివరాత్రి ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో, ఇది శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం మరియు వేసవి ప్రారంభంలో ఉంటుంది. ప్రేమ, శక్తి మరియు ఏకత్వం యొక్క స్వరూపంగా ఇది శివ మరియు శక్తి కలయిక యొక్క రాత్రిగా భావించబడటం వలన ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.

హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా శివుడు, పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే - పార్వతి ప్రకృతిని సూచిస్తుంది. ఈ చైతన్యం మరియు శక్తి కలయిక సృష్టిని ప్రోత్సహిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలేందుకు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు.మహా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేక జలాలతో, బిల్వార్చన లతో రుద్రాభిషేకాలతో పూజిస్తారు. శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు.

హరహర మహాదేవ శంభో శంకర, మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహాదేవుడి మహిమను తెలిపే శివ సూక్తులు, Lord Shiva Telugu Quotes, Maha Shivaratri Subhaakankshalu, Shivaratri Messages శివరాత్రి పర్వదినం విశిష్టతను తెలుసుకోండి

ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు చేస్తారు. రాత్రి వేళల్లో జాగరణ దీక్షలతో స్వామి వారిని పూజిస్తారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెబుతారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్థరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివ బిల్వార్చన, అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు విశేషంగా నమ్ముతారు.

ఈ రాత్రి శివుడిని ప్రార్థించడం ద్వారా ఒకరు తమ పాపాలను అధిగమించి, ధర్మమార్గంలో నడిచారని, వారికి సద్గతులు ప్రాప్తించాయని చెబుతోంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు.ఇక లింగోద్భవం పై కూడా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి.

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లో ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరించాడని ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెబుతాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళతాడు. అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పై భాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కో లేకపోతారు. అయితే బ్రహ్మకు ఆ సమయంలో కేతకీ పుష్పం, గోవు దర్శనమిస్తాయి. మొగలిపువ్వు, గోవుకి తాను శివలింగానికి ఆది కనుక్కున్నాను అని చెప్పి, అదే విషయాన్ని విష్ణు, శివుడి ముందు చెప్పాల్సిందిగా చెబుతాడు.దీంతో గోవు, మొగలి పువ్వు బ్రహ్మ చెప్పినట్లుగా శివుడి వద్ద చెబుతారు.

'ఓం నమ: శివాయ' స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు, చీకటి అనే అజ్ఞానాన్ని అధిగమించటమే శివరాత్రికి అర్థం, మహా శివరాత్రి పర్వదిన విశేషాలు తెలుసుకోండి

వారు అబద్ధం చెబుతున్నారు అని గ్రహించిన శివయ్య మొగలి పువ్వు ను, గోమాతను శపిస్తాడు. అబద్ధం చెప్పించినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి, పూజలు కానీ ఉండవని శాపం ఇస్తాడు. మొగలి పువ్వు పూజకు పనికిరానిదిగా శివుడు శాపం ఇస్తాడు. ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్దం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోక ని చూస్తే పాపపరిహారం గా శివుడు శపిస్తాడు. మహావిష్ణువు సత్యం చెప్పడం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం ,మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువు ఇవ్వడం గంట లింగోద్భవ కాలం లోనే జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ప్రధానంగా కనిపిస్తుంది.

ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగరూపం లోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకం చేసే ప్రాధాన్యత ప్రధానంగా కనిపిస్తుంది. పవిత్రమైన మహా శివరాత్రి పండుగ నాడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శైవ క్షేత్రాలకు పోటెత్తనున్న భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ శంభో అంటూ శివ నామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మ్రోగనున్నాయి.