130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్‌గా నిలిచిన మిలీనియం గర్ల్ హర్నాజ్ 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్ (Harnaaz Kaur Sandhu). 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించిని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది.
17 ఏళ్లకే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఈ చండీగఢ్ భామకు బాల్యం నుంచే మోడలింగ్‌పై అమితమైన ఆసక్తి. అటు వెండితెరపై కూడా మెరవాలనుకునేది. అందుకే విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడంపై దృష్టిసారించింది. మొదట మోడలింగ్‌లో బాగా రాణించిన హర్నాజ్ ఆ తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాలను చేజిక్కించుకుంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక మోడల్‌గానూ ఎన్నో వేదికలపై మెరిసిన హర్నాజ్ ఇప్పుడు ఇలా విశ్వ వేదికపై ఏకంగా మిస్ యూనివర్స్‌గా టైటిల్ సాధించడం విశేషం. ఈసారి తప్పకుండా కిరీటం సాధించి సుస్మితాసేన్, లారాదత్తాల సరసన చేరతానని ఈ పంజాబీ చిన్నది ముందే చెప్పింది. అన్నట్లే విజయం సాధించి దేశం గర్వపడేలా చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తోంది హర్నాజ్. విశ్వ సుందరిగా నిలిచిన ఆమెకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్‌నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపడేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది.
17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
హార్నాజ్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం.అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్.