Republic Day Wishes in Telugu : భారతదేశంలో గణతంత్ర వేడుకలు (Republic Day ) ప్రారంభమయ్యాయి. ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని పురస్కరించుకొని, తమ దేశం ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ జరుపుకునే జాతీయ ఉత్సవాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు. బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొందుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది, అయితే దేశంలో బ్రిటీష్ పాలనలోని రాజ్యాంగం రద్దు చేయబడిన తర్వాత, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పట్నించి భారతదేశం ఒక స్వతంత్రమైన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అధికారికంగా అవతరించింది.
భారత రాజ్యాంగానికి రూపకర్త 'భారతరత్న' డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్. ఎంతోమంది మేధావుల అభిప్రాయాలను తీసుకొని, ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారతదేశాన్ని ఒక గొప్ప, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దేందుకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలాన్ని వెచ్చించి రాజ్యాంగాన్ని లిఖించారు అంబేద్కర్. ఇది ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. ఇలా లిఖించబడిన రాజ్యాంగం 1950, జనవరి 26న తేదీన అమలులోకి తెచ్చారు, కాబట్టి ఆ తేదీని పురస్కరించుకొని ప్రతీ ఏడాది జనవరి 26ను (ఛబ్బీస్ జనవరిని) గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డేగా (Republic Day 2022) జరుపుకుంటాము.
దేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇక్కడ అందజేస్తున్నాం.
నేడు గణతంత్ర దినోత్సవం, భరతమాత ముద్దు బిడ్డలుగా మరోసారి జపిద్దాం మనకు స్వేచ్ఛనిచ్చిన మంత్రం- వందేమాతరం. చాటుదాం మన జాతీయ సమగ్రతా భావం, చూపుదాం ప్రపంచానికి మన ఐక్యతలోని బలం. జై హింద్!!
ఈ ప్రత్యేకమైన రోజున, మన స్వరాజ్య కర్తలు మనకందించిన స్వేచ్ఛను, విలువలను సంరక్షిస్తామని, భావితరాల శ్రేయస్సుకు తోడ్పడతామని మాతృభూమి సాక్షిగా వాగ్ధానం చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2022
ఎన్నో ఏళ్లుగా బానిసత్వం, స్వాతంత్ర యోధుల బలిదానంతో సిద్ధించింది ఈ స్వరాజ్యం, మన స్వేచ్ఛా వాయువుల కోసం, వేల మంది వదిలారు తమ శ్వాసం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ దేశం మనందరిది. ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడున్నా మనమంతా భారతీయులం. ఎక్కడున్నా తలెత్తుకు జీవించే గౌరవాన్ని కల్పించింది మన దేశం. మన విలువలు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం. 'భారత్ మాతా కీ జై' సగర్వంగా జరుపుకుందాం గణతంత్ర దినోత్సవం. భారతీయులందరికీ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున పేరుపేరునా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు