Image used for representational purpose only | (Photo Credits: wiki commons)

Viyyuru: జైలు కూడు తినాలనుకుంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏదైనా తప్పు చేసి పోలీసులకు దొరికిపోవాలి,రెండు సింపుల్ గా స్విగ్గీలో ఆర్డర్ వేయాలి. అవును, ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే జైల్లో వండిన భోజనం (Jail Biryani) నేరుగా మీ ఇంటికే వచ్చి డెలివరీ చేస్తారు. అయితే ఈ సదుపాయం కేవలం కేరళ (Kerala) రాష్ట్రంలోని వియ్యూరు సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది.

వియ్యూరు సెంట్రల్ జైల్ అధికారులు, జైల్లో వండిన వంటకాలు ప్రజలకు అందించేలా ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ (Swiggy)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. జైలు పరిధిలోని 6 కి. మీ మేర డెలివరీ అందించేందుకు స్విగ్గీ అంగీకరించింది. మొదటి దశలో భాగంగా 'ఫ్రీడమ్ కాంబో లంచ్' (Freedom Combo Lunch) పేరుతో మెనూను సిద్ధం చేశారు. ఈ కాంబోలో భాగంగా 300 gms బిర్యానీ రైస్, ఒక రోస్టెడ్ లెగ్ పీస్, 3 చపాతీలు, ఒక కప్ కేక్, సలాడ్, చట్నీ మరియు ఒక వాటర్ బాటిల్ తో పాటు అరటి ఆకులో తినేలా ప్యాక్ చేసి కేవలం రూ. 127కే ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. ఈ వంటలన్నీ పూర్తిగా జైలులో ఖైదీలు వండినవే.

వియ్యూరు సెంట్రల్ జైల్ సూపరిండెంట్ నిర్మలానందన్ నాయర్ మాట్లాడుతూ, ఇక్కడి జైలు భోజనం అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. తాము 2011 నుంచే ఇక్కడ ఒక కౌంటర్ ద్వారా చపాతీలు విక్రయించడం ప్రారంభించామని అంతేకాకుండా నాన్-వెజ్ కూరలు, వెజ్ కూరలు, బేకరీ పదార్థాలు కూడా ఎప్పట్నించో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ జైలు వంటకాలన్నీ నాణ్యతగా, రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తుండటంతో ప్రజల్లో మంచి డిమాండ్ ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తమ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆన్ లైన్ లో విక్రయించాలనే ఆలోచన చేసినట్లు నాయర్ తెలిపారు.

ప్రస్తుతానికి ప్రతిరోజు 100 మంది ఖైదీలు కలిసి తయారు చేస్తున్న 25,000 చపాతీలు, 500కు పైగా బిర్యానీలు విక్రయిస్తున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. జైలు భోజనం తినిపించడమే కాకుండా జైలు వాతావరణం ఎలా ఉంటుందో బయట ప్రపంచానికి తెలిసేలా జైలులో ఒక రోజు గడిపే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలనే ఆలోచన కూడా తమ పరిశీలనలో ఉందని జైళ్ల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనికోసం ప్రజల నుంచి కొంత మొత్తాన్ని ఛార్జ్ చేసి వారికి జైలులో గరిష్టంగా ఒకరోజు గడిపేలా 'పే అండ్ స్టే' విధానం ప్రవేశ పెట్టనున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ప్రతి రోజూ క్రిమినల్స్ తో గడుపుతూ జైలు అధికారులు కూడా క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నట్లు లేదు. అందుకేనేమో ఇలాంటి బిజినెస్ మెన్ థాట్స్ వస్తున్నాయి వీళ్లకి.  జై బోలో జైల్ బిర్యానీకి!