COVID-19 Vaccine Update: వికటించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసిన ఆక్స్‌ఫర్డ్, సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ బయటకు తెస్తామని తెలిపిన ఫార్మా సంస్థలు
Vaccine | Image used for representational purpose (Photo Credits: Oxford Twitter)

London, September 9: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca Coronavirus Vaccine Trails) ట్రయల్స్‌ను నిలిపివేశారు. మూడో దశ ట్రయల్స్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca Coronavirus Vaccine) వికటించింది. మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను బ్రిటన్ వాసిపై ప్రయోగించగా, తీవ్రమైన సెడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆక్స్‌ఫర్డ్ (Oxford) మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసుందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ విషయంలో తాము త్వరపడటం లేదని, అన్ని రకాలుగా సురక్షితమని తేలితేనే టీకాను అందుబాటులోకి తెస్తామని దిగ్గజ ఫార్మా సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు పలు కంపెనీల సీఈఓలు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్, నోవావ్యాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈ లేఖపై సంతకాలు చేయడం గమనార్హం.

దేశంలో 34 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసులు, తాజాగా 89,706 మందికి కరోనా, కోవిడ్-19తో తాజాగా 1,115 మంది మృతితో 73,890కు చేరుకున్న మరణాల సంఖ్య

తమకు ప్రజారోగ్యం, వారి భద్రతే ముఖ్యమని, వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన లేదని, దగ్గరి దారులను అనుసరించడం లేదని వారు స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్ అయినా, పూర్తిగా సురక్షితమని తేలిన తరువాతే ఆమోదం కోసం నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేస్తామని తెలిపారు. కాగా, ఈ లేఖలో చైనా, రష్యాలకు చెందిన ఫార్మా కంపెనీలు మాత్రం సంతకాలు చేయక పోవడం గమనార్హం.

సామాన్యులకు అందుబాటులో రష్యా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్, సెప్టెంబర్ 10 న తొలి బ్యాచ్ విడుదల, ముందుగా హైరిస్క్‌ గ్రూపులకు ప్రాధాన్యత

ఇదిలావుండగా, మరో నెల రోజుల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. నవంబర్ లో ఎన్నికలను ఎదుర్కోనున్న ఆయన, ప్రజల మెప్పు కోసమే ఇటువంటి అసత్యపు ప్రకటనలు చేస్తున్నారని డెమోక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు. ట్రంప్ మాటలు నమ్మశక్యంగా లేవని, ట్రయల్స్ ముగియకుండానే వ్యాక్సిన్ ను ఎలా తెస్తారని ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ విమర్శలు కురిపించారు. ఇక, ట్రంప్ చెప్పినట్టుగా అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ ను విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చని యూఎస్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు.