Coronavirus: ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్, 30 రోజుల పాటు దానిపైన కరోనా వైరస్, అగ్నేయ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా
Image used for representational purpose | (Photo credits: Pixabay/RitaE)

ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్.. అందులో పెట్టే మాంసం ఉత్పత్తుల పైన దాదాపు 30 రోజుల పాటు కరోనావైరస్ (Coronavirus) ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. కోవిడ్-19 కలిగించే SARS-CoV-2 వైరస్ ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో మాంసం మరియు చేప ఉత్పత్తులపై 30 రోజుల వరకు (30 days on meat, fish) కొనసాగవచ్చని పరిశోధకులు తేల్చారు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కరోనా వైరస్ విస్తరణపై ఇటీవల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఒకరికొకరు సంబంధం లేకుండా అంటే కాంటాక్టులేమీ లేకుండా కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. దీనికి కారణం ఏమిటన్నది తేల్చేందుకు పలు అంశాలను పరిశీలించారు. అందులో భాగంగా చికెన్, మటన్, చేపలు, బీఫ్ వంటి వాటిని మార్కెట్ నుంచి సేకరించారు. వాటిపై కొన్ని రకాల కరోనా వైరస్ లను వేసి.. ఫ్రిజ్ లో, డీప్ ఫ్రీజర్ లో నిల్వ ఉంచారు. కొన్ని రోజుల తర్వాత వాటిని పరిశీలించగా.. మాంసంపై కరోనా తరహా వైరస్ లు సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. తాజాగా అప్లైడ్ అండ్ ఎన్విరాన్ మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

జికా వైరస్ లక్షణాలు ఇవే, దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కలకలం పుట్టిస్తున్న జికా వైరస్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జికావైరస్ కేసులు, అప్రమత్తతపై హెచ్చరిస్తున్న వైద్యులు

పరిశోధకులు మాంసం మరియు చేప ఉత్పత్తులను ఫ్రీజర్‌లో మరియు శీతలీకరణలో (4 డిగ్రీల సెల్సియస్) (మైనస్ 20 డిగ్రీల సెల్సియస్) ఉంచారు. డీప్ ఫ్రీజర్ లో ఉంచినప్పుడు వైరస్ నిద్రాణంగా ఉన్నా.. దానిని బయటికి తీసిన వెంటనే యాక్టివ్ గా మారి ప్రత్యుత్పత్తి చేసుకోవడం మొదలు పెట్టాయని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికా క్యాంప్ బెల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ బైలీ తెలిపారు. ఫ్రిజ్ లో పెట్టిన మాంసంపై కరోనా వైరస్ నెల రోజులకుపైగా జీవించి ఉండగలదని పేర్కొన్నారు.

ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్యాకేజ్డ్ మాంసం వినియోగించే, తయారు చేసే ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మాంసం ఉత్పత్తుల విషయంలో శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా మాంసం ప్రాసెసింగ్ చేసే ప్రాంతాలు, అక్కడ పనిచేసేవారు పరిశుభ్రత పాటించాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.