
Hyderabad, OCT 20: ఇటీవల కాలంలో కిడ్నీల సమస్యతో (kidney problems) బాధపడే వారి సంఖ్య అధికంగా కనిపిస్తోంది. మూత్రం రాకపోవడం, వెనుక భాగంలో నొప్పి వంటి సమస్యలు ఉంటే కిడ్నీల్లో (kidney problems) ఏదైనా ఇబ్బంది ఉందేమో అని భావించవచ్చు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిపే మరికొన్ని సూచనలు కూడా ఉన్నాయి. మీ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు మీ రక్తం నుండి వ్యర్థాలు, ద్రవాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. హృదయ, శ్వాసకోశ ఆరోగ్యంతో పాటు కిడ్నీలను కాపాడుకోవడం అవసరం. సరైన లైఫ్‌స్టైల్‌తో మధుమేహం (Sugar), రక్తపోటు (Blood Pressure) వంటి ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స పొందుతూ కిడ్నీల సమస్యలను తగ్గించుకోవచ్చు. కిడ్నీ సమస్యల లక్షణాలలో ఒకటి నోటి దుర్వాసన (Smelly breath). శరీరంలో యూరియా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. కిడ్నీ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. యూరియా అనేది ఓ సమ్మేళనం. ఇది శరీర కణాల ద్వారా ఉపయోగించే ప్రోటీన్ల ప్రాథమిక నత్రజని విచ్ఛిన్న ఉత్పత్తి, మూత్రంలో విసర్జింపబడుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉంటే మీ శరీరం ఖనిజాలను తొలగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అధిక యూరియా మీ శ్వాస, రుచిని ప్రభావితం చేస్తాయి. ఖనిజాల స్థాయిలు రక్తప్రవాహంలో పెరుగుతాయి. రుచిలో తేడా ఉంటుంది. లోహ రుచితోపాటు (metallic taste), నోటి నుండి దుర్వాసన వెదజల్లుతుంది.
తగినంత ద్రవాలు తాగకపోవడం, ఇతర కారణాల వల్ల మూత్ర నాళంలో అడ్డంకులు ఏర్పడతాయి. శరీరంలో యూరియా స్థాయిలు పెరిగితే తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రోటీన్ తక్కువగా తీసుకోవాలి. రెడ్ మీట్, చేపలు, పాల ఉత్పత్తులు, బీన్స్, గింజలు, ధాన్యాలు వంటి హై ప్రోటీన్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని యూరియా, క్రియాటినిన్ శరీరం నుండి విసర్జించబడతాయి.
నోటి దుర్వాసన సమస్య దీర్ఘకాలంపాటు అలాగే కొనసాగుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. అయితే కొందరు సాధారణ నోటి దుర్వాసనగా భావించి చిన్న చిన్న గృహ చిట్కాలతో సరిపెడుతుంటారు. ఇలా చేయటం ఏమాత్రం సరికాదు. దీని వల్ల కిడ్నీలు పూర్తి స్ధాయిలో దెబ్బతినే పరిస్ధితి ఏర్పడుతుంది. కాబట్టి సమస్య గుర్తించిన వెంటనే సకాలంలో వైద్యులను సంప్రదించటం వల్ల తగిని చికిత్సను అందించేందుకు అవకాశం ఉంటుంది.