రోజుకు 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్‌లోని గ్రనాడా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. 6.4 కిలోమీటర్లు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందు రోజుకు కనీసం 10 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని గత అధ్యయనాలు చెబుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన తాజా అధ్యయనం 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే చాలని చెబుతోంది.
రోజుకు ఒక కప్పు బొప్పాయి పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..
10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో కొందరు ఆ నంబరును చేరుకునేందుకు కష్టపడుతున్నారని, అధికబరువు ఉన్న వారికి దీనివల్ల ఇబ్బంది పడడంతోపాటు వారి గుండెపై మరింత ఒత్తిడి పడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. కాబట్టి రోజుకు 2,500 నుంచి 3 వేల అడుగులతో మొదలుపెట్టి క్రమంగా ప్రతి 15 రోజులకు 500 అడుగులు పెంచుకుంటూ పోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు ఉన్నవారు తొలుత 1000 అడుగులతో మొదలుపెట్టినా సరిపోతుందని పేర్కొన్నారు. ఇక, వృద్ధులైతే మాత్రం తమ శక్తిమేరకు లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం మేలని వివరించారు.