Mancherial, February 4: కరోనా వ్యాప్తి కారణంగా భారీగా దెబ్బతిన్న రంగాలలో పర్యాటక రంగం ఒకటి. అయితే ఇప్పుడు కోవిడ్ కోలుకునేవారి సంఖ్య పెరగడం మరియు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావటంతో పర్యాటక రంగం మళ్లీ పునరుజ్జీవం పొందుతుంది. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉత్కంఠభరితమైన జంగల్ సఫారీ ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు మరిన్ని కొత్త హంగులు మరియు అదనపు సౌలభ్యాలతో ప్రకృతి ప్రేమికులను గతంలో కంటే ఎక్కువ ఆకర్శించేందుకు సిద్ధమైంది. ఇందుకు తగినట్లుగా సఫారీల రేట్లు పెరగనున్నాయి. ప్రతిపాదనల ప్రకారం ఒక్కో వ్యక్తికి రూ. 500 ఛార్జ్ చేయనుండగా, సొంత వాహనాలను ఉపయోగించటానికి ప్రస్తుతమున్న రూ.1,000 బదులుగా రూ. 1,500 వసూలు చేయనున్నారు.
లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. ప్రకృతిలో ఎంజాయ్ చేయాలనుకునేవారు ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, జంగల్ సఫారి లాంటి అడ్వెంచర్స్ ను మిస్సయ్యారు. అయితే, అలాంటి వారి కోసం ఇప్పుడు కవాల్ టైగర్ రిజర్వ్ లోని జంగల్ సఫారీ ఆహ్వానిస్తోంది. కోవిడ్ నిబంధనలు మాత్రం యధాతథంగా పాటించాల్సి ఉంటుంది.
అటవీ శాఖ- పర్యాటక శాఖల సమన్వయంతో త్వరలోనే ప్రజలకు సఫారీ సేవలను పున:ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం జనవరి 26 నుంచే బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అడవిలో 30 కి.మీ పరిధిలో సాగే ఈ యాత్రలో ట్యాంకులు, వాచ్‌టవర్లు, మచన్లు మరియు బర్డింగ్ స్పాట్‌లు చూడొచ్చు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2012లో ఏర్పాటు చేయబడింది. ఇది ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్ మరియు నిర్మల్ ప్రాంతాల పరిధిలో 893 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించబడి ఉంది. ఇందులో పెద్ద పులులు, చిరుతపులులు, తోడేళ్ళు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లులు, భారతీయ గౌర్లు, నక్కలు, నీలం ఎద్దులు, అడవి పందులు, ముంగూస్, సాంబార్ జింకలు వంటి అడవి జంతువులు ఉన్నాయి. చుట్టూ కొండలు, టేకు- వెదురు అడవులు, సెలయేళ్లు, జలపాతాలు, ప్రవాహాలు ఎన్నో కనువిందు చేస్తాయి.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను సందర్శించాలనుకునేవారు హైదరాబాద్ నుండి నిర్మల్ చేరుకొని అక్కడ్నించి నిర్మల్-మంచిర్యాల్ మార్గంలో ప్రయాణించాలి. లేదా మంచిర్యాల్ చేరుకొని అక్కడి నుంచి జన్నారం మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.