Dehradun, February 18: కుంభమేళా కరోనావైరస్ యొక్క హాట్ స్పాట్ గా మారే అవకాశం ఉంది, దీనిని నిరోధించడానికే మేళా వ్యవధిని తగ్గించే నిర్ణయాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ తెలిపారు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు కేవలం 30 రోజుల పాటు మాత్రమే మేళా జరుగుతుందని వెల్లడించిన ఆయన, ఇందుకు సంబంధించి అధికారిక నోటీసును మార్చి చివరి నాటికి జారీ చేయబడుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి రవిశంకర్ మాట్లాడుతూ కుంభమేళాకి హాజరయ్యే యాత్రికులకు పాస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కుంభమేళాలో పాల్గొనదలిచే యాత్రికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేసుకోవాలని.. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తో పాటు, ఇతర మెడికల్ సర్టిఫికేట్లు మరియు గుర్తింపు కార్డు ద్వారా పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్‌లు లేని వారికి ప్రవేశం నిరాకరించబడుతుంది ”అని రవిశంకర్ అన్నారు.
అలాగే కుంభమేళాలో యాత్రికుల భద్రత కోసం విధుల్లో నియమించబడిన సిబ్బందికి 70,000 మోతాదుల COVID-19 వ్యాక్సిన్లను జిల్లా యంత్రాంగం కోరినట్లు ఆయన తెలిపారు. జనాన్ని పర్యవేక్షించడానికి గంగా ఘాట్ల వద్ద కెమెరాలు మరియు ఇతర నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
మహా కుంభం 12 సంవత్సరాల కాలచక్రంలో భారతదేశం అంతటా నాలుగు నదీ తీర తీర్థయాత్రలలో జరుపుకుంటారు. ఈ మేళా ఏప్రిల్ చివరి వారంలో ముగుస్తుంది.