Lakshadweep Tour: సహజమైన ప్రకృతి అందాలకు నిలయం, లక్షణమైన దీవుల సముదాయం.. లక్షద్వీప్ టూర్ చేయాలని ఉందా? ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకోండి!
Lakshadweep | File Photo

Lakshadweep Tour: బీచ్ అడ్వెంచర్స్ చేయడానికి, హనీమూన్ కోసం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంను ఎంచుకోవడానికి చాలా మంది కొత్త జంటలు ఠక్కున చెప్పే పేరు మాల్దీవ్స్. అయితే, ఇటీవల ద్వీప దేశమైన మాల్దీవులతో తలెత్తిన దౌత్యపరమైన వివాదం తర్వాత చాలా మంది భారతీయులు లక్షద్వీప్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారు. ఇప్పుడు మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా, మరోవైపు లక్షద్వీప్ పర్యటించాలనుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తాజా 2024 బడ్జెట్లో కూడా భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రకటనలు చేశారు. లక్షద్వీప్‌లో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచటానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, సౌకర్యాల కోసం కొత్త ప్రాజెక్టులను భారతదేశ పరిధిలోని ద్వీపాలలో చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

లక్షద్వీప్‌ ప్రధాన ఆకర్షణలు:

లక్షద్వీప్ 36 ద్వీపాలను కలిగి ఉన్నప్పటికీ, మనుషులు నివసించేది మాత్రం కేవలం 10 దీవుల్లోనే. అవి కవరత్తి, అగట్టి, కద్మత్, కల్పేని, మినీకాయ్, ఆండ్రోట్, అమిని, కిల్తాన్, చెట్లత్, బిత్రా. ఇందులో కవరత్తి లక్షద్వీప్ రాజధాని. పర్యాటకులు ఈ దీవులన్నింటినీ సందర్శించవచ్చు.

లక్షద్వీప్‌లోని బీచ్‌లు పరిశుభ్రత, ప్రశాంతతకు ప్రసిద్ధి చెందాయి. ఆకుపచ్చ-రంగు నీటితో క్రిస్టల్-క్లియర్ మడుగులు లక్షద్వీప్ దీవులకు ప్రత్యేక ఆకర్షణ. పగడాలు దిబ్బలు, వైవిధ్యమైన సముద్ర జీవుల వీక్షణ, ఇక్కడి గ్రామాలు, సముద్ర మ్యూజియం, లైట్‌హౌస్‌ వంటివి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇంకా, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ , స్కీయింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. పారదర్శకమైన గ్లాస్ బాటమ్‌తో పడవలపై ప్రయాణం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

లక్షద్వీప్ ఎలా చేరుకోవాలి?

లక్షద్వీప్ అనేది కేరళ రాష్ట్రానికి సమీపాన, అరేబియా సముద్రంలో ఉన్న సహజమైన దీవుల సముదాయం. ఈ అందమైన ద్వీపాలు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు, స్వచ్ఛమైన జలాలకు, ముత్యాలు పగడాల దిబ్బలకు ప్రసిద్ధి. లక్షద్వీప్‌పై సంక్షిప్త టూరిజం గైడ్ ఇక్కడ ఉంది.

నౌకలు, విమానాల ద్వారా మాత్రమే ఈ ప్రదేశాలకు చేరుకోవచ్చు. కేరళలోని కోచ్చి నగరం నుండి నౌకలు లక్షద్వీప్‌లోని వివిధ ద్వీపాలకు సేవలను నిర్వహిస్తాయి. కోచ్చి విమానాశ్రయం నుండి లక్షద్వీప్‌లోని అగట్టి వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అగట్టి నుండి, ఇతర ద్వీపాలకు ఓడలు, పడవలు అందుబాటులో ఉన్నాయి. ఓడలో ఛార్జీ రూ. 1500 నుండి ప్రారంభమవుతాయి, విమాన టిక్కెట్లు రూ.5000 నుంచి ప్రారంభమవుతాయి. వాటర్ అడ్వెంచర్స్ చేయటానికి వివిధ టూరిజం సంస్థలు కూడా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి.

ప్రయాణానికి నిబంధనలు

లక్షద్వీప్ మన దేశం పరిధిలోనే ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పర్యటించటానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. తప్పనిసరిగా సరైన అనుమతి పత్రాలను ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది. లక్షద్వీప్‌లోని శాశ్వత నివాసితుల ద్వారా స్పాన్సర్‌షిప్ పొందాలి. అవసరమయ్యే పత్రాలేమిటో ఈ కింద చూడండి.

1) స్పాన్సర్ ద్వారా డిక్లరేషన్ ఫారమ్ తప్పనిసరి. ఇందుకోసం ప్రతీ బృందానికి రూ. 50 చలాన్ , ప్రతి సందర్శకుడికి రూ. 200 హెరిటేజ్ ఫీజు రసీదు తీసుకోవాలి. ఆపై ఈ పత్రాలను కోచ్చిలోని విల్లింగ్‌డన్ ఐలాండ్‌లోని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క టూరిజం సెల్‌లో సమర్పించాలి.

2) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్: కేరళ పోలీస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అన్నీ పరిశీలించాక అనుమతి సర్టిఫికేట్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

అయితే, ఈ సర్టిఫికెట్లలో, పర్యాటకులు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే పొందాలి. అన్ని ఇతర పత్రాలు స్పాన్సర్లు లేదా టూర్ ఆపరేటర్లచే ఏర్పాటు చేయబడతాయి.