Hyderabad - Bangkok Indigo Flights:

Hyderabad - Bangkok Indigo Flights: స్నేహితులతో కలిసి గోవా వెళ్దామని ఎన్నిసార్లు ప్లాన్ చేసినా మీ ప్లాన్ వర్కవుట్ అవ్వడం లేదా? గోవా బదులు నేరుగా బ్యాంకాక్ టూర్ వెళ్లే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్- బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.  భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, హైదరాబాద్- బ్యాంకాక్ మధ్య రోజువారీ డైరెక్ట్ విమానాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచే ఈ రెండు నగరాల మధ్య డెయిలీ సర్వీసులు ప్రారంభమైనట్లు ఇండిగో తెలిపింది. మొత్తంగా ఒక వారంలో భారత్ మరియు థాయిలండ్ మధ్య 37 ఇండిగో విమాన సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ పేర్కొంది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్స్ పెరగడంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య పర్యాటకం, ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతాయని ఇండిగో యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్- బ్యాంకాక్ మధ్య ఇండిగో తొలి విమానం ఫ్లైట్ నంబర్ 6E 1067తో కూడిన ఎయిర్‌బస్ A320 నియో హైదరాబాద్ నుండి తెల్లవారుజామున 3:50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి, ఉదయం 8:40 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బ్యాంకాక్‌లో దిగింది. రోజువారీ విమాన షెడ్యూల్‌లో 6E 1067 ఫ్లైట్ హైదరాబాద్ నుండి ఉదయం 3.55 గంటలకు బయలుదేరి 9.05 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది, తిరుగు ప్రయాణంలో 6E 1068 బ్యాంకాక్ నుండి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'హైదరాబాద్ - బ్యాంకాక్ మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. ప్రజలు వారు ఇష్టపడే గమ్యస్థానాలను మరింత చేరువ చేయడం ఇండిగో ఉద్దేశ్యం. ప్రజలకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం అందించటం, పర్యాటకంను మెరుగుపరిచి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఇది మా వంతు ప్రయత్నం' అని పేర్కొన్నారు.

హైదరాబాద్- బ్యాంకాక్ మధ్య ఇప్పటికే ఎయిర్ ఇండియా, విస్తారా వంటి సంస్థలు విమాన సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ఇవి వయా ముంబై, ఢిల్లీ మీదుగా వెళ్తూ ప్రయాణానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. థాయ్ ఎయిర్‌వేస్, నాక్ ఎయిర్ వంటి థాయ్‌లాండ్ దేశపు విమాన సంస్థలు కూడా సర్వీసులు నడుపుతున్నాయి. అయితే ఇప్పుడు ఇండిగో చేరికతో హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ప్రయాణ సమయం చాలా తగ్గిపోనుంది. పోటీ పెరగడంతో విమాన ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

బ్యాంకాక్ ఒక ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక హాట్‌స్పాట్. గొప్ప సాంస్కృతిక వారసత్వం, రుచికరమైన వంటకాలు, ఉల్లాసభరితమైన నైట్ లైఫ్ కలిగి ఉన్న ఒక శక్తివంతమైన నగరం. బ్యాంకాక్‌లో ప్రతిరోజూ పార్టీలాగే ఉంటుంది. ముఖ్యంగా థాయ్ మసాజ్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి బ్యాంకాక్ వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన ప్యాలెస్‌లు, ఆకాశహర్మ్యాలు, మ్యూజియంలు, మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఫ్లోటింగ్ మార్కెట్, సఫారీ వరల్డ్, సియామ్ ఓషన్ వరల్డ్, చావో ఫ్రయా డిన్నర్ క్రూజ్ వంటివి బ్యాంకాక్  ప్రధాన ఆకర్షణలు.