ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళల భద్రతకు ఎలాంటి భరోసా దక్కడం లేదు. అలాగే మృగాళ్ల ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. బయట అడుగుపెట్టిన ఆడపిల్లకు రక్షణ దొరకడం లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. పిల్లలు అని కూడా చూడటం లేదు, వారిపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ దారుణాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా బీహార్ లో దారుణం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన ఓ మైనర్ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. బాలికను బంధించి గ్యాంగ్ రేప్ చేశారు. ఇలా నెల రోజుల పాటు అత్యాచారం చేశారు. బీహార్ బెట్టియాలో గోనాహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు యువకులు బాలికను వెంబడించారు. అదను చూసి కిడ్నాప్ చేశారు. యూపీలోని గోరక్ పూర్ కి బాలికను తీసుకెళ్లారు. అక్కడ బాలికను నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేశారు.
ఓసారి బాలిక తప్పించుకుంది. అయితే మళ్లీ ఆ యువకులు బాలికను పట్టుకున్నారు. గ్రామానికి చెందిన అనిల్ అతడి స్నేహితులు తనను కిడ్నాప్ చేశారని, తన చేతులు కట్టేశారని, నోటికి ప్లాస్టర్ అంటించి టెంపోలో తీసుకెళ్లారని బాలిక తెలిపింది. ఆ ముగ్గురు తనను కొట్టేవారని, తనకు డ్రగ్స్ ఎక్కించారని తెలిపింది. తనను నిర్బంధించి నెల రోజుల పాటు అత్యాచారం చేశారని చెప్పింది. బాలిక కిడ్నాప్ విషయం బయటకు రావడంతో భయపడిని ముగ్గురు యువకులు బాలికను వరి పొలాల్లోకి విసిరేసి పారిపోయారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.