డేటింగ్ యాప్‌లో అందమైన అమ్మాయిలతో మసాజ్ ఆఫర్‌కు ఆకర్షితుడైన యువకుడు.. నలుగురు అమ్మాయిల గ్యాంగ్ చేతిలో నిలువు దోపిడీకి గురయ్యాడు. రూ.55.30 లక్షలు పోగొట్టుకుని (ndian robbed of over Rs 55 lakh in Dubai) లబోదిబోమన్నాడు. గత నవంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందమైన అమ్మాయిల ఫోటోలు ఎరవేసిన నలుగురు యువతులు ఆ యువకుడ్ని బంధించి మరీ రూ.55 లక్షలు దోచుకున్నారు.
ఘటన వివరాల్లోకెళితే.. ఓ డేటింగ్ యాప్‌లో (Dating App) అందమైన అమ్మాయిల (Girls) ఫొటోలు చూసిన 33 ఏళ్ల భారతీయ యువకుడు.. రూ. రూ. 3,950 చెల్లించి పేరు నమోదు చేసుకున్నాడు. అతను భారత్ నుంచి వెళ్లి దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు.
మసాజ్ చేస్తామంటూ అందమైన అమ్మాయిలను చూపిస్తూ వచ్చిన ఓ యాడ్‌పై క్లిక్ చేశాక అందులో ఉన్న ఫోన్ నంబరుకు కాల్ చేయమని నిర్వహాకులు చెప్పడంతో అతను కాల్ చేశాడు. ఓ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని వారు చెప్పడంతో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడున్న వారిని చూసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. నలుగురు దిట్టమైన ఆఫ్రికన్ యువతులు వెంటనే అతడిపై దాడికి దిగి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు.
అతడి జేబులోంచి ఏటీఎం కార్డును లాక్కుని.. అతడ్ని తమ అపార్ట్‌మెంట్‌లో కట్టిపడేశారు. రోజు వ్యవధిలో నింపాదిగా అతడి అకౌంట్‌లో నుంచి మొత్తం 55,30,806 రూపాయలు దోచుకున్నారు. ఆ తర్వాత అతడి ఫోన్ లాక్కుని విడిచిపెట్టేసి.. తమ దారిన తాము దర్జాగా వెళ్లిపోయారు. వెంటనే ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు యువతుల్ని అరెస్టు చేశారు. మరో యువతి పరారీలో ఉంది. నిందితులు నైజీరియాకు చెందిన వారని, వీరిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.