Indian Bull | Representational Image | Photo: Pixabay

Chandigarh : బంగారం ధరలు రోజురోజుకు అందనంత ఎత్తుకు పోతున్నాయి, ఈరోజు అక్టోబర్ 30న కూడా మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.39,540 నడుస్తుంది. లక్షలు ధారపోసినా పిడికెడు బంగారం దొరకడం లేని ఈరోజుల్లో ఒక మహిళ అజాగ్రత్త కారణంగా 40 గ్రాముల బంగారం కోల్పోయినట్లయింది. 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎద్దు తినేసింది!

అసలు ఏం జరిగింది? వివరాల్లోకి వెళ్తే.. హరియాణ రాష్ట్రంలోని సిర్సా (Sirsa) అనే పట్టణంలో బాధితుడు జనక్ రాజ్ (JanakRaj) కథనం ప్రకారం, ఈనెల 19న తన భార్య, కోడలు వంటగదిలో పనిచేస్తూ తమ ఒంటి మీద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాల (Gold Ornaments) ను ఒక గిన్నెలో ఉంచారు. కూరగాయలు తురుముతూ దాని ద్వారా వచ్చిన వ్యర్థాలను మాటల్లో పడి అదే గిన్నెలో వేశారు. ఆ తర్వాత ఆ చెత్తనంతా తీసుకెళ్లి బయటపడేశారు.  ( పైసల్ ఎత్తుకుపోయిన కోతి, చెట్టుమీదకు ఎక్కి కుప్పిగంతులు)

ఆ తర్వాత చాలాసేపటికి నగల విషయం గుర్తుకొచ్చి అందుకోసం వెతికారు. గిన్నెలో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకున్నపుడు అప్పుడు బల్బ్ వెలిగింది. వెంటనే వెళ్లి బయట చెత్తలో మొత్తం వెతికారు కానీ బంగారం దొరకలేదు. దీంతో ఇంటికి ఉన్న సిసిటీవీ ఫుటేజిని పరిశీలిస్తే ఓ ఎద్దు ఆ కూరగాయలు ఉన్న చెత్తను, బంగారాన్ని మేసినట్లు కనిపించింది.  (Also Read మూడు గంటల్లో రూ.2.7 కోట్లు హాంఫట్ చేసిన మేక)

ఇక ఆ ఎద్దు (Bull) పెట్టిన పేడలో మొత్తం వెతికారు దొరకలేదు, ఆ ఎద్దును ఇంటి ఆవరణలోనే కట్టేసుకొని అది ఎప్పుడు పేడ పెడుతుందా అని ఎదురుచూస్తూ, అది వేయగానే ఆ పేడలో వెతకడం వీరి పని అయింది. అయినప్పటికీ లభించకపోవడంతో మళ్ళీమళ్ళీ దానికి తిండిపెడుతున్నారు, వెటర్నరీ డాక్టరును తీసుకొచ్చి కూడా ప్రయత్నించి చూశారు అయినా లాభం లేదు. కంటి మీద కునుకు లేకుండా దాని పేడ కోసం ఇంటి సభ్యులు షిఫ్ట్ లా వారీగా ఎదురుచూశారు. కావాల్సినంత పేడ పెట్టింది కానీ, బంగారాన్ని మాత్రం బయటకు పంపలేదు. వీరి నిర్వాకం చూసి చుట్టుపక్కల వారు సైతం పాపం అనుకుంటూనే, పడీపడీ నవ్వుకున్నారు. ఎద్దుపై అసహనం వ్యక్తం చేసిన ఆ ఇంటి సభ్యులు, ఇక ఎద్దును గోశాలకు అప్పజెప్పేస్తామని తెలియజేశారు.