
Multivitamins Might Not Help You Live Longer: మల్టీవిటమిన్ సప్లిమెంట్లను చాలా మంది అమెరికన్లు చాలా కాలంగా ఒక నిర్దిష్ట రోజులో అవసరమైన అన్ని విటమిన్‌లను పొందేలా చేయడానికి అనుకూలమైన మార్గంగా ఉపయోగిస్తున్నారు. వారు ఆ విషయంలో క్రియాత్మకంగా ఉన్నప్పటికీ, ఎంత కాలం జీవిస్తున్నారనే దానిపై కొత్త అధ్యయనం కొన్ని వాస్తవాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మల్టీవిటమిన్‌లు తీసుకున్నప్పటికీ ఎక్కువ కాలం జీవించడంలో అవి సహాయపడకపోవచ్చని ఈ అధ్యయనం కనుగొంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) శాస్త్రవేత్తలచే నిర్వహించబడిన ఈ పరిశోధన, జూన్ 26న JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించబడింది.
ప్రతిరోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆయుష్షు పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కారణం కావొచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏండ్ల పాటు అధ్యయనం చేశారు.ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లు ఉపయోగపడటం లేదని, మరణ ముప్పును ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు తేల్చారు.
మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ యొక్క అనుబంధ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ బార్నార్డ్ తెలిపారు. ప్రజలు సప్లిమెంట్ల కంటే ఆహారం నుండి వచ్చే విటమిన్‌లను తీసుకోవడం ఉత్తమమని తెలిపారు. తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోవడం మంచిదని, మాంసం, మద్యపానం, ఒకేచోట కూర్చోవడం తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు.