Cops Under Arrest: పోలీసులనే బంధించిన కిలాడీ,  సీజ్ చేసి కారులో షికారుకెళ్లిన పోలీసులు, రిమోట్ కంట్రోల్‌తో 3 గంటల పాటు కారులోనే బంధించిన యజమాని
UP Police- Representational Image | PTI Photo

Lucknow, March 6: అదొక కీలకమైన మర్డర్ కేసు, ఆ మర్డర్ కేసు దర్యాప్తులో భాగంగా ఆధారాలు సేకరించేందుకు ఒక ఎస్సై మరియు కొంతమంది కానిస్టేబుళ్లు ఒక చోటుకు బయలు దేరారు. ఇంతలో అనుకోకుండా వారు ప్రయాణిస్తున్న కార్ దానంతటే ఆగిపోయింది. కార్ తలుపులు, కిటికీలు అన్నీ లాక్ చేయబడ్డాయి. అందులో చిక్కుకున్న పోలీసుల్లో గందరగోళం, ఏమై ఉంటుంది? దెయ్యామా? మరేదైనా ట్రాప్ లో పడ్డారా?

వివరాల్లోకి వెళ్దాం, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నో నగరంలోని గోమతినగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో 'అలకనంద' అనే పేరుగల హైక్లాస్ అపార్టుమెంటు ఉంది. ఈ అపార్టుమెంట్ గేట్ సమీపంలో ప్రశాంత్ సింగ్ అనబడే ఒక 20 ఏళ్లు ఉండే ఇంజనీరింగ్ డ్రాప్-అవుట్ విద్యార్థిపై దాదాపు అదే వయసు ఉన్న ఒక 10-12 మంది యువకులు మూకుమ్మడి దాడులు చేశారు. ఆ విద్యార్థిని కత్తులతో పొడిచి చంపారు. అనేక కత్తిపోట్లకు గురైన ప్రశాంత్ సింగ్ అక్కడిక్కడే చనిపోయాడు. అయితే పట్టుమని పాతికేళ్లు నిండని వీరందరికి తన సహచర విద్యార్థిపై కత్తులతో పొడిచి చంపాల్సిన అవసరం ఏం వచ్చింది? ఈ దాడి చేసిన వాళ్లలో ఎమ్మెల్యేల కొడుకు, వ్యాపారవేత్తల కొడుకులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేశారు కూడా, నిందితులుగా అనుమానిస్తున్న మిగతావారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంలోనే, ఈ కేసులో (Gomatinagar Murder Case) నిందుతుడిగా అనుమానిస్తున్న ఓ యువకుడు ఉత్తరప్రదేశ్ లోని లెఖింపూర్ ఖేరి జిల్లాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతణ్ని విచారించడం కోసమే పోలీసులు మొన్న బుధవారం బయలుదేరారు.

హాట్.. పోలీస్ కారులో వెళ్తే మజా ఏముంటుందిలే? నిన్న మనం సీజ్ చేసిన కొత్త ఎస్‌యూవీ కార్ (Seized SUV) ఉందిగా, ఆ బండి బయటకు తీయండి దాంట్లో పోదాం అని పెద్ద పోలీస్ ఆదేశించడంతో ఎవరూ ఆపలేదు. అందరూ (Lucknow Police)  ఆ కారులో బయలుదేరి పోయారు.

ఇంతలో ఆ కారు యజమాని సీజ్ చేసిన తన కారును విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ వచ్చాడు. కార్ అక్కడ కనిపించలేదు. అది హైఎండ్ ఎస్‌యూవీ కార్ కావడం, అధునాతన ఫీచర్లు అమర్చబడి ఉండటంతో తన మొబైల్ ఫోన్లో ఉన్న ఒక యాప్ తెరిచిచూశాడు. దీంతో ఆ కార్ లక్నోకి 143 కిలోమీటర్ల దూరంలో లెఖింపూర్ ఖేరి (lakhimpur kheri) జిల్లాలోని నాయి బస్తీ అనే గ్రామ పరిసరాల్లో కదులుతున్నట్లు కనిపించింది.

దీంతో పోలీస్ స్టేషన్లో కూడా తన కారుకు సేఫ్టీ లేదా అనుకొని వెంటనే తన యాప్ ద్వారా ఇంజన్ ఆఫ్ చేసి, సెంట్రల్ లాక్ చేశాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న పోలీసుల పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కున్నట్లయింది. కారులో నుంచి బయటకు రావడానికి అన్ని విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత తిరిగి ఆ కార్ యజమానికే పోలీసులు కాల్ చేశారు.  గూగుల్ నావిగేషన్ చూపిన 'రాంగ్ టర్న్' ఎక్కడికి దారితీసింది..?

అయితే ఆ యజమాని మాత్రం పోలీసుల మాటలను ఖాతరు చేయలేదు. తాము పోలీసులం అని, కేసు మీద వెళ్తున్నాం, తిరిగొస్తాం అని పోలీసులు ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ యజమాని చస్తే వినలేదు. చివరకు ఒక కండీషన్ మీద ఒప్పుకున్నాడు.  తన కారు తనకు తిరిగి లక్నోలో తన ఇంటికి తెచ్చి ఇస్తా అంటేనే ఇంజన్ ఆన్ చేస్తా, లేకపోతే లాక్ కూడా తెరవను అని తేల్చిచెప్పాడు.

అంతేకాకుండా అనవసరంగా తన కారును సీజ్ చేయడమే కాకుండా, దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఆ పోలీసులపై రివర్స్‌లో కేసు కూడా పెట్టాడు. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.