Google's Wrong Turn: గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేశాయి? మీరూ గూగుల్ మ్యాప్స్ ద్వారా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త తప్పకుండా చదవాలి.
Representational Image Only| Credits : Pixabay

Denver, Colorado:  ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే ఎవర్నో దారిన పోయే దానయ్యను దారి అడగాల్సిన పనిలేదు 'జస్ట్ ఆస్క్ గూగుల్' (Google). ఎక్కడైనా దారి తప్పిపోయినా 'క్యూ డర్ నా.. మైహూనా' అంటుంది గూగుల్, ఎవరికి ఏదైనా అడ్రస్ చెప్పాలన్నా సింపుల్‌గా గూగుల్ మ్యాప్స్‌లో రూట్ షేర్ చేసేస్తున్నారు. గూగుల్ మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది. అయితే మారి గూగుల్ మ్యాప్స్‌ను (Google Navigation) గుడ్డిగా నమ్మారో మిమ్మల్ని బురదలో ముంచేస్తుంది. ఇలాంటి ఘటనే ఇటీవల అమెరికాలోని కొలరడో ప్రాంతంలో జరిగింది.

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఓ కారు యాక్సిడెంటుకు గురవ్వడం వల్ల అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

దీంతో గూగుల్ నేవిగేషన్ ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఉందని సూచిస్తూ, మరో షార్ట్ మార్గంలో వెళ్లాల్సిందిగా ఇంకోవైపు రీరూట్ చేసింది. అరెరె ఎయిర్ పోర్టుకు అర్జెంట్‌గా వెళ్లాలి, ఇప్పుడెలా అని ఆలోచించన ఓ డ్రైవర్ ఎప్పుడూ వెళ్లే మార్గంలో కాకుండా గూగుల్ చెప్పినట్లుగా మరో మార్గంలోకి వాహనాన్ని మల్లించాడు, అలా గూగుల్ ఇస్తున్న సూచనలు ప్రకారం ముందుకు వెళ్తూ ఉండగా కొంతదూరం వెళ్లిన తర్వాత అక్కడ రోడ్డు మాయమైంది, మొత్తం బురదనే ఉంది. అయినా సరే ముందుకు వెళ్లాల్సిందిగా గూగుల్ సూచించడంతో డ్రైవర్ ముందుకు తీసుకెళ్లగానే కారు దిగబడి కదల్లేని పరిస్థితికి వచ్చింది. ఇలా ఈ ఒక్క కారే కాదు, ఒకదాని వెనక మరొకటి మొత్తం 100కు పైగా కార్లు ఇదే రూట్‌లో వచ్చి బురదలో కూరుకుపోయాయి.

దీంతో చాలామంది అనవసరంగా ఇటు వచ్చి ఇరుక్కుపోయామనుకుని వాపోయారు. కొంతమంది లక్కీగా వారి కార్లను వెనక్కి తీసుకోగలిగారు, ఇంకొంతమంది కనీసం కార్ డోర్స్ కూడా తెరుచుకోని విధంగా బురదలో కూరుకుపోయారు. అలాంటి వారు కారులో నుంచి బయటకు రావటానికి సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చిందని, ఇంకొంతమందైతే చేసేదేం లేక వారు తమ కారు పైభాగాన్ని  పూర్తిగా విరగొట్టి బయటకు రావాల్సి వచ్చిందని అక్కడ ఇరుక్కున్న వారిలో కొందరు తమ అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత చాలా మందికి తెలిసిందేందంటే అసలు అటువైపు దారే లేదు, అది ఒక ప్రవేట్ ఎస్టేట్, అందులో బయటివారికి అనుమతి కూడా లేదని.

ఈ విషయంపై గూగుల్‌ని నిలదీస్తే, వాతావరణ మార్పుల వల్ల రోడ్లు పాడైపోవచ్చు, అప్పుడప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురుకావచ్చు దానికి మేమేం చేస్తాం? మేము కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తాం, ఆ మార్గం గుండా వెళ్లాలా? వద్దా? అనే విచక్షణ నడిపేవారికి ఉండాలి అని రివర్స్ అటాక్ చేసింది.

అది సంగతీ, కాబట్టి గూగుల్ మ్యాప్స్‌ను మీరూ కళ్లు మూసుకొని గుడ్డిగా ఫాలో అయ్యారో మిమ్మల్ని కూడా ఏ కొండపై నుంచో కిందికి తోసేస్తుంది. ఇలాంటి సంఘటనలు మన వద్ద కూడా చాలా చోట్ల జరిగాయి.  అయినా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సిందే.  గూగుల్ మ్యాప్స్ చాలా సందర్భాల్లో చాలా బాగా ఉపయోగపడతాయి కానీ పూర్తిగా వాటిపైనే ఆధారపడకుండా జాగ్రత్తపడాలని ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చాం.