Google Year in Search 2023 in India (Photo Credit: Unsplash)

మరో 19 రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట. ఆ తర్వాత అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, దేశం మొత్తానికి ఒకే పౌర స్మృతి, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, టర్కీ భూకంపం తదితర అంశాలు ఉన్నాయి.

లైఫ్ స్టయిల్ విభాగానికి వస్తే.. చర్మసౌందర్య పోషణ గురించి, జుడియోస్ (వస్త్ర దుకాణం), జిమ్ లు, బ్యూటీ పార్లర్లు, చర్మ సంబంధ వ్యాధుల నిపుణుల గురించి వెదికినట్టు వెల్లడైంది. క్రీడాంశాల సెర్చింగ్ లో ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ దే అగ్రస్థానం. టీమిండియా-ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ గురించి తెలుసుకునేందుకు కూడా అత్యధికులు ఆసక్తి చూపారు.

యూట్యూబ్‌లో 5 వేల ఫాలోవర్స్‌ని ఎలా సాధించాలి. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా శోధించింది ఇదేనట..

ఇక భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగానూ అత్యధికంగా ట్రెండింగ్ ఉన్న క్రికెటర్లు శుభ్ మాన్ గిల్, రచిన్ రవీంద్ర. గిల్ ఇటీవల సెంచరీల మోత మోగిస్తుండగా, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో సంచనాలు సృష్టించాడు. దాంతో వీరిద్దరి గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో బాగా సెర్చ్ చేశారు.

సినిమాల విషయానికొస్తే... షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ చిత్రం భారత్ లో నెంబర్ వన్ గా నిలవగా, ప్రపంచవ్యాప్త గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో మూడో స్థానంలో నిలిచింది. గదర్-2, పఠాన్ చిత్రాల గురించి కూడా నెటిజన్లు బాగా వెదికారట.