'Grandpa' Kitchen is No More: పది మందికి అన్నం పెట్టిన చేయి దూరమైంది, 'గ్రాండ్‌పా కిచెన్' పేరుతో ప్రసిద్ధిగాంచిన  ప్రముఖ యూట్యూబర్ నారాయణ రెడ్డి తాత కన్నుమూశారు
Grandpa Kichen (Photo Credits: YouTube)

"బ్రతికి ఉన్నని రోజులు నలుగురికి అన్నంపెట్టి మంచిగా బ్రతికి వెళ్లిపోవాలి" ఇవి ఆ తాత ఎప్పుడూ చెప్పే మాటలు, చెప్పినట్లుగానే ఆ తాత ఎంతో మంది అనాధ పిల్లలకు, నిర్భాగ్యులకు పసందైన వంటకాలు వండి ప్రేమతో తినిపించేవాడు. ఆయనే నారాయణ రెడ్డి (Narayana Reddy). అందరూ ఆయనను ప్రేమతో 'తాత' అని పిలుచుకుంటారు.  అయితే నారాయణ రెడ్డి తాత మృతి చెందాడనే వార్త ఆయన అభిమానులను తీవ్ర దు:ఖంలో ముంచేసింది.

తాత చేసే ఎన్నో రకాల వంటలు, వంట చేసే విధానం, ప్రేమతో వడ్డించే తీరు అన్ని వీడియో తీసి ఆయన కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి 'GrandPa Kitchen' పేరుతో 2017లో యూట్యూబ్‌లో ఒక ఛానెల్ క్రియేట్ చేసి అందులో అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. పచ్చని పంటపొలాల మధ్య, స్వచ్చమైన మనసుతో చేసే నారాయణ రెడ్డి తాత చేసే వంటకాలు ఊరు దాటి, దేశం దాటి అంతర్జాతీయంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఛానెల్ క్రియేట్ చేసిన ఒక్క సంవత్సరంలోనే 40 లక్షల మంది ఆ ఛానెల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.  ఇంత ఫేమస్ అయిన నారాయణ రెడ్డి తాత మన తెలుగు వాడు కావడం విశేషం. ఆయనది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండంలోని చిన్న పల్లెటూరు మల్కీజ్ గూడ.

Giant Apollo Fish Fry Recipe By Beloved Narayana Reddy Thaatha

నారాయణ రెడ్డి తాత ఒక్క ఇండియన్ వంటకాలనే కాదు, చైనీస్, థాయ్, కాంటినెంటల్ వంటకాలను కూడా సహజసిద్ధంగా వండటం చూసి ఆయనకు అంతార్జీయంగా ఫాలోవర్లు ఏర్పడ్డారు. కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే ఆ వంటకం ఎలా చేయాలో ఆసక్తికరంగా అందులో వివరిస్తారు. వీడియోలలో తాత మాట్లాడే ఇంగ్లీష్, ఆయన మాట్లాడే చమత్కారమైన మాటలకూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తనకు తెలిసిన ఇంగ్లీషు భాషలో నారాయణ రెడ్డి తాత తాను చేయబోయే వంటను, వండే విధానాన్ని ఎంతో ఆత్మీయంగా వివరించేవారు. అది చూసి తన అభిమానులు తమ ఇంటి వద్ద ఆ వంటను ప్రయత్నించేవారు.

ఆయనేమి హామిలిచ్చే రాజకీయ నాయకుడు కాదు, తెరపైన ప్రేమను పంచే నటుడు కాదు. నిజమైన వాడు, నిజాయితీ గల వాడు.  అందుకే నిస్వార్థంతో నిరుపేదలకు ఆయన చేసే సేవను మెచ్చి ఎంతో మంది ఆయనకు ఫిదా అయ్యారు. చాలా మంది యువకులు ఆయన వెంట నడిచారు. తాత చేసే సేవాకార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేవారు. అలా నిరుపేదలకు, అనాధ పిల్లలకు కడుపునిండా కమ్మని భోజనం, బట్టకాలు, పుస్తకాలు వారి శక్తిమేరకు దానం చేసేవారు. అలాంటి  నారాయణ రెడ్డి తాత ఇక లేరనే వార్తతో ఆయనకు దగ్గరైన ఎన్నో లక్షల మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Watch the Video of Grandpa's Final Journey:

ఇంత ప్రేమను పంచి, ఇన్ని జ్ఞాపకాలను ఇచ్చి, జీవిత పాఠాలను నేర్పిన నారాయణ రెడ్డి తాతను ఒక సీనియర్ యూట్యూబర్ గా, ఒక సేవామూర్తిగా ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.  RIP grandpa Narayana Reddy.