అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన (Horrifying incident in US) చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడి ఉండటం అక్కడ తీవ్ర కలకలం రేపింది. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే 49 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.
అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ (US Man Found Dead in Home With 125 Snakes) కనిపించాయి. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. అయితే ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అతడి మరణానికి ( 49-year-old man found dead at home) ఇంకా కారణాలు తెలియలేదు. అయితే పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఆ ఇంటిలో సుమారు 125 పాములు కనుగొనగా అందులో విషం లేనివి, అత్యధిక విషమున్న పాములూ ఉన్నాయి. స్పిట్టింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు, 14 అడుగుల పొడవున్న కొండచిలువ, ఇతర సరీసృపాలు ఉన్నాయి. కాగా అమెరికాలో విషపూరిత పాములను సేకరించడం చట్ట విరుద్ధమైన చర్య. ఈక్రమంలో ఇన్ని రకాల పాములను సేకరించడం, ఇంట్లో పెంచుకోవడం చాల అరుదైన సంఘటన అని అక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా ఆ ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయని చుట్టుపక్కల వారు తెగ భయపడుతున్నారు. దీనిపై అక్కడి అధికారులు స్పందిస్తూ ‘ఇంట్లోని పాముల్లో ఏవీ తప్పించుకోలేదని, అన్నింటినీ తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.