Hyderabad, September 20: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నిర్వహిస్తున్న సెన్సేషనల్ షో ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’లో (Kaun Banega Crorepati 14) పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇంతా చేస్తే ఆమె చదువుకున్నది 12వ తరగతి కావడం మరో విశేషం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ (Kolhapur)కు చెందిన కవితా చావ్లా (Kavita Chawla)ఈ ఘతన సాధించారు. ఈ సందర్భంగా ‘ఇండియా టుడే’తో ఆమె మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ షోలో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదన్నారు. తన కుమారుడికి తాను ఏది బోధించినా ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునే దానినని, ముఖ్యమైన విషయాలను అండర్‌లైన్ చేసుకునే దానినని గుర్తు చేసుకున్నారు. కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతడి కల అని తెలిపారు. నిజానికి తాను డబ్బులు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ షోలో పాల్గొనలేదని అంటారు కవితా చావ్లా. ఆత్మగౌరవం కోసమే తానీ షోలో పాల్గొన్నట్టు చెప్పారు.