Romance Scam: డేటింగ్ యాప్‌ ద్వారా ఒంటరి మహిళకు గాలం.. కండలు చూపి వలపు వల విసిరాడు, ఆపై సర్వస్వం దోచేశాడు, అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్న బాధితురాలు
Representational Image (Photo Credits: Pxhere)

Romance Scam: మెరిసేదంతా బంగారం కాదు, ఈరోజుల్లో ఆన్‌లైన్‌లో కనిపించేదంతా నిజం కాదు, అక్కడ మన కళ్లు మనల్ని మోసం చేయవచ్చు. అందానికి ఆకర్షితులై సొల్లు కార్చుకుంటే, ఆ తర్వాతి పరిణామాలకి కన్నీళ్లు కార్చాల్చి రావచ్చు. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకొని, ఆపైన ప్రేమ పేరుతో బురిడి కొట్టించే ఉదంతాలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా, వాటి నుంచి జనం పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. అందమైన ప్రొఫైల్ పిక్ పెట్టి డేటింగ్ యాప్‌ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు, కండలు చూపి వలపు వల విసిరాడు, చివరకు ఆ మహిళను సర్వస్వం దోచేశాడు. అంతా సమర్పించుకున్నాక అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు ఇప్పుడు లబోదిబోమంటుంది. అసలేం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదవండి.

శ్రేయా దత్తా అనే 37 ఏళ్ల భారతీయ మహిళ అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఒక టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంది. ఇంతగా టెక్నాలజీ తెలిసినా ఆమె ఆ మహిళ కూడా తాను ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్‌కు ఎలా బలైందో వివరించింది.

విడాకులు తీసుకొని, ఏ తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. మోడు వారినట్లుగా సాగుతున్నట్లుగా తన జీవితంలో ప్రేమ పువ్వు వికసించినట్లు డేటింగ్ యాప్ కొత్త ఆశను చిగురింపజేసింది.  శ్రేయాకు కొన్నాళ్ల కిందట 'హింగే' అనే డేటింగ్ యాప్ ద్వారా అన్సెల్ (Ancel) అనే యువకుడు పరిచయం అయ్యాడు. తనను తాను ఒక వైన్స్ వ్యాపారికి అతడు చెప్పుకున్నాడు. అందమైన రూపం, ఆకట్టుకునే అతడి శరీర సౌష్టవం చూసి శ్రేయ అతడికి వెంటనే ఆకర్షితమైంది. చాలా త్వరగా తమ ఫోన్ నెంబర్లను పంచుకున్నారు, ఇక అప్పట్నించి వాట్సాప్ లో చాటింగ్ మొదలైంది. అన్సెల్ తన కండలు, బాడీ బిల్డింగ్ చూపుతూ మత్తెక్కించే మాటలు చెబుతూ శ్రేయాను ఊరించే వాడు. అడపాదడపా వీడియో కాలింగ్ చేస్తూ వలపు బాణాలు విసిరేవాడు, ఇలా శ్రేయాను తన ప్రేమలో మునిగేలా చేశాడు. అన్సెల్ ముఖంపై చక్కని చిరునవ్వు, అతడు మాట్లాడే తేనెలొలికే మాటలకు శ్రేయా పూర్తిగా పూర్తిగా అతడికి దాసోహం అయ్యేది. అన్సెల్ ఏం మాట్లాడినా చాలా ఇష్టంగా వినేది.

ఈ క్రమంలోనే ఒకరోజు అన్సెల్ మాట్లాడుతూ ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉద్యోగం చేస్తావు, నీకు 62 ఏళ్లు వచ్చినా ఉద్యోగం చేస్తూనే ఉంటావా అని చెబుతూ ఒక సలహా ఇచ్చాడు. క్రిప్టో కరెన్సీలో మదుపు చేస్తే, పని చేయకుండానే డబ్బు దానంతటదే వస్తుందని చెప్పి ఒక యాప్ లింక్ పంపించాడు. దీనిని గుడ్డిగా నమ్మిన శ్రేయా అతడు చెప్పినట్లుగానే చేస్తూ ఆ యాప్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయింది. ఆ యాప్ కూడా డబ్బుకు ఇంట్రెస్ట్ భారీగా వచ్చినట్లు చూపించేది. అయితే ఒకరోజు, శ్రేయా తన ఖాతాలోంచి డబ్బు తీయబోతే నగదు లేదని సమాధానం వచ్చింది. తీరా చూస్తే తన డబ్బంతా పోయి, ఖాతా సున్నాకి చేరినట్లు గ్రహించింది. ఒకటి కాదు, రెండు కాదు.. అక్షరాల 450,000 డాలర్లు అంటే, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 4 కోట్ల రూపాయలు పోగొట్టుకుంది.

అన్సెల్ ను నిలదీద్దామనుకుంటే అతడు ఎప్పట్లాగే కలవటానికి నిరాకరించాడు, ఆపై తనను బ్లాక్ చేసి ఆన్ లైన్ లోనూ మాయమయ్యాడు. దీంతో జరిగిన విషయం అంతా శ్రేయా తన సోదరుడికి చెప్పుకుంది. శ్రేయా సోదరుడు విచారించగా, అసలు అన్సెల్ ప్రొఫెల్ నకిలీది అని తెలిసింది. అన్సెల్ పెట్టిన ప్రొఫైల్ పిక్ కూడా అతడిది కాదు, ఆ ప్రొఫైల్ పిక్ జర్మనీకి చెందిన ఒక సెలబ్రిటీ అని తేలింది. ఆ సైబర్ క్రైమ్ నేరస్తుడు డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోకాల్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ దెబ్బకు శ్రేయా దిమ్మతిరిగిపోయింది. సోదరుడి సహకారంతో అమెరికాలోని FBI మరియు సీక్రెట్ సర్వీస్‌కు శ్రేయా ఫిర్యాదు చేసింది. ఈ సైబర్ మోసంతో తాను ఆర్థికంగానే కాదు, మానసికంగానూ కుంగిపోయినట్లు వివరించింది. అన్సెల్ తనను ఎప్పటికప్పుడు తిన్నావా లేదా అడిగేవాడని, తనకు ప్రేమగా చూసుకునే మంచి భర్త రావాలని భగవంతుణ్ని రోజూ ప్రార్థించేవాడని శ్రేయా చెప్పింది. కానీ, అన్సెల్ చెప్పినవన్నీ అబద్ధాలే, తను చూపిన ప్రేమ నకిలీది అని తెలిసి చాలా బాధగా ఉంది, మొత్తం డబ్బు పోయి చాలా కష్టంగా గడుస్తుందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇలా శ్రేయా ఒక్కరే కాదు, ఇలా చాలా మంది బాధితులు ఆన్ లైన్ ప్రేమల మోసాలకు బలవుతున్నారు.

కాగా, 'పిగ్ బుచరింగ్' గా పేర్కొనే ఈ తరహా ఆన్‌లైన్ రొమాంటిక్ స్కామ్ నేరాలు ఈ మధ్య పెరిగిపోయాయని, డేటింగ్ యాప్స్, అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.