Navi Mumbai, September 17: దేశంలో కరోనావైరస్ విజృంభినతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి, ఎవరైనా కొవిడ్ తో చనిపోతే కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోలేని పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి దుర్బరమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది తమ పొలంలో మొలకలు వచ్చేలా చేసుకుంటున్నారు. లాక్డౌన్ కొంతమందికి 'హామ్ తుమ్ ఎక్ కమ్రే మే బంద్ హో' అని డ్యుఎట్స్ పాడుకునేలా అవకాశాన్ని కల్పించింది.
ఇక అసలు విషయానికి వస్తే ఒక ఎఫ్2 భర్త తన భార్యకు కరోనా సోకింది ఇక సెలవు అని చెప్పి, ప్రియురాలితో జంప్ జిలాని అయిన ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, నవీ ముంబైలోని వాశి ప్రాంతానికి చెందిన ఓ 28 ఏళ్ల వివాహితుడు గత నెల జూలై 24న తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. తనకు కొవిడ్ సోకింది చనిపోబోతున్నాను, ఇక తన గురించి ఎవరు వెతకకండి అని చెబుతూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన భార్య, అతడి కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు.
బాధితిరాలి సోదరుడు తన బావ కోసం అతనికి తెలిసిన చోటల్లా వెతకడం ప్రారంభించాడు. మరుసటి రోజు ఓ చోట తన బావకు సంబంధించిన బైక్ కీ, హెల్మెట్, ఆఫీస్ బ్యాగ్, పర్సు తదితర వస్తువులు గుర్తించాడు. దీంతో మరింత ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వాశి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన సదరు వ్యక్తి కోసం ముంబైలోని అన్ని కొవిడ్ కేంద్రాలలో ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడా కూడా అతడి వివరాలు నమోదు కాలేదు.
దీంతో ఆత్మహత్య ఏమైనా చేసుకొని ఉంటాడా అనే అనుమానంతో వాశి సమీపంలోని సముద్రపు బ్యాక్ వాటర్ క్రీక్ లో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతడి జాడ తెలియరాలేదు.
దీంతో పోలీసులు ఇక మరో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పటికీ దాని సిగ్నల్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ సమీపంలో గుర్తించారు. ఇక అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే దొరవారు తన పేరు, వివరాలు అన్ని మార్చుకొని హాయిగా తన ప్రియురాలితో వేరే కాపురం పెట్టేశాడు.
పక్కా ప్లాన్ వేసి ఆ మాయగాడ్ని పట్టుకున్న పోలీసులు ఏమి అనకుండా నేరుగా నవీ ముంబై తీసుకొచ్చి, ఇక మీరు చూసుకోండి అన్నట్లుగా తిరిగి అతడి భార్యకే అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అనేది మీ ఊహకే వదిలివేస్తున్నాం.