Save water Monkey Tries to Fix Leaking Pipe With Dry Leaves, Video Goes Viral (photo-Twitter)

October 12:  రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి ముప్పు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ నీటిని పొదుపు చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ నీటిని పొదుపుచేస్తున్నారా అంటే చాలా చోట్ల పొదుపు కాదు కదా..లీకయిన నీటిని కూడా అరికట్టలేకపోతున్నారు. దానికి తోడు సాగరాలను, సముద్రాలను, చెరువులను కలుషితం చేస్తున్నారు. ఎక్కడైనా నీరు లీకయితే మనకెందుకులే అని వదిలి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ జాతితో పాటు భూమి మీద నివసించే ప్రాణికోటి మొత్తం ఇబ్బందుల పాలుగాక తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకయిన నీటిని రక్షించుకునేందుకు ఓ వానరం చేసిన పని అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. సేవ్ వాటర్ అన్న నినాదానికి ఊపిరిపోస్తోంది.

సేవ్ వాటర్ 

యూనిసెఫ్‌ కార్యకర్త నిహారికా సింగ్ పంజేతా సోషల్‌ మీడియా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో.. పైపులైన్‌ నుంచి లీక్‌ అవుతున్న నీటిని వృథా కానీయకుండా వానరం ఆకులను అడ్డుపెడుతోంది. నీటిని ఆపేందుకు ఎంతో ప్రయత్నిస్తోంది. వానరం చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. పైపు నుంచి ఉబికి వస్తున్న నీటిని ఆపేందుకు ఆ కోతి ఎండు ఆకులను అడ్డం పెట్టడం ఆలోచింపచేసేదిగా ఉందని అంటున్నారు. ‘నీటిని వృథా చేయకూడదనే గొప్ప ఆలోచన. మనుషులుగా మనం తప్పు చేసినా అందమైన ఈ ఆత్మలు.. అడవి బిడ్డలు మనకు గుణపాఠం చెబుతున్నాయి. వాటికి ఉన్న బుద్ధి, సున్నితత్వం మనకు లేకుండా పోయింది. సిగ్గుపడాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇది వరకే ఓ వీడియో ఇలానే ట్రెండ్ అయింది. ఓవానరం కుళాయి విప్పి నీళ్లు తాగింది. ఆ తర్వాత నీళ్లు వృథా కాకుండా కుళాయిని కట్టేసింది. ‘‘ఈ కోతి మనుషులకు ఎంత చక్కని సందేశం ఇచ్చింది’’ అంటూ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ ఎస్.వై.ఖురేషీ.. ఈ వీడియోను ట్వీట్ చేయగానే అది కాస్తా వైరల్ అయ్యింది.

నీటి విలువ తెలుసుకోవాల్సిందే

ఈ వీడియో చూసైనా నీటి విలువ తెలుసుకోవాలని అందరూ దానిపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ వీడియో ఎక్కడిదనేది మాత్రం తెలియలేదు.