New Delhi, Sep 13: టీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాకిచ్చింది. 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులను పంపించింది ఐటీ డిపార్ట్ మెంట్. టీడీఎస్ విషయంలో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు పంపింది. కంపెనీలో ఉద్యోగి సీనియారిటీని బట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అందులో పేర్కొంది.
సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు కారణంగా టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సరిగ్గా అప్ డేట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు చెల్లించిన టీడీఎస్‌కు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 143(1)కి లోబడి సెప్టెంబర్ 9న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
ఐటీ శాఖ నోటీసులపై టీసీఎస్ స్పందించింది. ఈ నోటీసులకు స్పందించి ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చింది. సంస్థ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెల్లింపులు చేయవద్దని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.