Lucknow, Mar 7: సుమారు 12 సంవత్సరాల వయసులో తనపై అత్యాచారానికి పాల్పడ్డవారిపై 27 సంవత్సరాల తర్వాత (Raped 27 yrs ago) ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి కారణం తన తండ్రెవరని ఆమె కుమారుడు ఆమెను ప్రశ్నించడంతో ఈ నిర్ణయం (woman lodges complaint) తీసుకున్నట్లు తెలిపింది. 27 సంవత్సరాల క్రితం తన సోదరితో కలిసి నివసిస్తుండగా, స్థానికంగా ఉండే నకి హసన్ అనే వ్యక్తి ఇంట్లోకి జొరపబడి అత్యాచారం జరిపాడని, అనంతరం అతని సోదరుడు గుడ్డు అనే వ్యక్తి కూడా అత్యాచారం చేశాడని, హసన్, గుడ్డు ఆ తర్వాత పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు.
ఘటన వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లా సదర్ ప్రాంతంలో భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వారి బంధువులకు చెందిన 12 ఏళ్ల బాలిక, ఇంట్లోనే ఉంటూ పనులు చేస్తుండేది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మరికొన్ని రోజుల తరువాత ఆమె అసహాయతను గమనించిన ఇంకో యువకుడు కూడా అదే పని చేశాడు. ఆపై ఆమె గర్భం ధరించి, ఓ మగబిడ్డను ప్రసవించింది. బాధితురాలి బంధువులు బిడ్డను మరొకరికి అప్పగించి, ఆమెకు వివాహం చేశారు. ఆమెకు గతంలోనే బిడ్డ ఉన్నాడని తెలుసుకున్న అతను వదిలేసి వెళ్లడంతో, ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
27 సంవత్సరాలు తిరిగిన తరువాత, ఆమెకు నాడు పుట్టిన కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతన్ని పెంచుకున్న తల్లిదండ్రులు జన్మరహస్యాన్ని వెల్లడించడంతో, తన తల్లి వద్దకు వచ్చిన ఆ యువకుడు, తండ్రి ఎవరో చెప్పాలని (son asks father's name) కోరాడు. ఆ విషయంలో స్పష్టమైన అవగాహన లేని ఆమె, తనపై అత్యాచారం చేసిన ఇద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత పోలీసులు ఈ కేసు నమోదుకు అంగీకరించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి ఫిర్యాదును రిజిస్టర్ చేయించారు. తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ, కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితులు ఇద్దరికీ డీఎన్ఏ పరీక్షలు చేయాలని, బిడ్డకు తండ్రి ఎవరో నిరూపించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రక్త నమూనాలు సేకరించి, డీఎన్ఏ పరీక్షలను జరిపించనున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.