Beijing, April 28: ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యులతో తరచూ రోగుల బందువులు గొడవపడటం మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు వారిపై దాడి చేయడం కూడా మనకు తెలుసు. కానీ ఆస్పత్రిలో పనిచేస్తున్న రోబోపై దాడికి దిగింది ఓ మహిళ. ఈ ఘటన చైనాలో జరిగింది. రోబో రిసెప్షనిస్ట్‌పై (Robot Receptionist) ఒక మహిళ దాడి చేసింది. కర్రతో దానిని పలుమార్లు కొట్టింది. దీంతో ఆ రోబోకు అమర్చిన పరికరాలు పగిలి అక్కడి నేలపై పడ్డాయి. చైనా ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నెల 23న ఈశాన్య తీరంలోని జియాంగ్సు ప్రావిన్స్ జుజౌ నగరంలోని జుజౌ మెడికల్ యూనివర్శిటీ అనుబంధ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది.
హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న రోబోపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. లాబీలోని రోగులను తనిఖీ చేసే ఆ రోబోను తిడుతూ కర్రతో దాడి చేసింది. రోబో తల, చేతుల భాగాలపై కర్రతో కొట్టింది. దీంతో రోబో యంత్రాలు విరిగి కింద పడ్డాయి. ఆ మహిళ రోబోను కొట్టడం చూసి హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది, రోగులు భయాందోళన చెందారు. ఆ మహిళకు దూరంగా వెళ్లి నిల్చొన్నారు. స్పందించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే రోబోపై దాడి చేసిన ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు తెలిపారు.
కాగా, చైనా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి బదులు రోబో సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటితోనే రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేవలం కొంత మంది నర్సులు మాత్రమే రోగులకు సేవలందిస్తున్నారు. దీంతో రోబోలతో వైద్య సేవలపై చైనా ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన ఆ మహిళ రోబోపై ఇలా కర్రతో దాడి చేసి ఉంటుందని కొందరు పేర్కొన్నారు. చైనా వెర్షన్ టిక్‌టాక్ డౌయిన్‌లో తొలుత షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.