కొవిడ్ విజృంభణ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. కొంతమంది దీనికి బాగా అలవాటుపడిపోగా.. మరికొందరు ఎప్పుడెప్పుడు ఆఫీసులకు వెళ్లి పనిచేస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ వ్యాపార సంస్థ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ అధినేత హర్ష్ గోయెంకాకు (Business tycoon Harsh Goenka) ఓ లేఖ అందింది. ఆర్పీజీ సంస్థలో పనిచేసే మనోజ్ అనే ఉద్యోగి భార్య ఆ లేఖ రాసింది.
ప్రస్తుతం తన భర్త వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాడని తెలిపింది. వర్క్ ఫ్రం హోం విధానం ఇంకా కొనసాగితే తన కాపురం కూలిపోతుందని (Work From Home will end marriage) ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తమ వివాహ బంధం ఎంతమాత్రం నిలవదని పేర్కొంది. వర్క్ ఫ్రం హోం కారణంగా నా భర్త ఇంట్లోనే ఉంటూ రోజుకు 10 పర్యాయాలు కాఫీ తాగుతున్నాడు. ఒక్క రూములో కాకుండా ఇంట్లో ఉన్న అనేక రూముల్లోకి మారుతూ చికాకు కలిగిస్తున్నాడు. తిండి, తిండి, తిండి... ఎప్పుడు చూసినా తిండి కావాలి అని అడుగుతున్నాడు.
అంతేకాదు, పని వేళల్లో అతడు నిద్రపోవడం కూడా గమనించాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారిని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం కొనసాగితే మేం దివాలా తీస్తాం. అందుకే మిమ్మల్ని ఈ విధానం ఎత్తివేయాలని కోరుతున్నాను" అంటూ ఆ లేఖలో పేర్కొంది. దయచేసి తగిన చర్యలు తీసుకుని తనకు మనశ్శాంతిని ప్రసాదించాలని ఆమె అర్థించింది. నా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీ సాయాన్ని కోరుతున్నాను అంటూ రాసుకువచ్చింది. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు.. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి’’ అని కోరింది.
Here's Harsh Goenka Tweet
Don’t know how to respond to her….😀 pic.twitter.com/SuLFKzbCXy
— Harsh Goenka (@hvgoenka) September 9, 2021
హర్ష్ గోయెంకా ఆ లేఖను ట్విట్టర్ లో (Harsh Goenka Viral Tweet) పంచుకున్నారు. ఆమె అభ్యర్థన పట్ల ఎలా స్పందించాలో తెలియడంలేదని పేర్కొన్నారు. ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. వర్క్ ఫ్రం హోంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఈ లేఖలో చక్కగా వర్ణించారు. భర్తలకు వర్క్ ఫ్రం హోం వల్ల మాకు పని భారం పెరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే దీన్ని 5,300 మంది లైక్ చేయగా.. 480 మంది రీట్వీట్ చేశారు.