హిందీ భాష విష‌యంలోబాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌పై క‌ర్నాట‌క మాజీ సీఎంలు విరుచుకుప‌డ్డారు. హిందీ జాతీయ భాష అని అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన ట్వీట్ విష‌యంలో త‌లెత్తిన వివాదంపై (Hindi National Language Row) మాజీ సీఎంలు కుమార‌స్వామి, సిద్ధ‌రామ‌య్య‌లు స్పందించారు. హిందీ ఎన్న‌డూ మ‌న జాతీయ భాష కాదు అని, ఎన్న‌టికీ కాబోద‌ని సిద్ద‌రామ‌య్య (Siddaramaiah and HDK message for Ajay Devgn) ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న భాషా భిన్న‌త్వాన్ని గౌర‌వించ‌డం ప్ర‌తి భార‌తీయుడి విధి అన్నారు. ప్ర‌తి భాష‌కు సంప‌న్న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, దాని ప‌ట్ల గ‌ర్వ‌ప‌డాల‌న్నారు. తాను క‌న్న‌డీయునైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య తెలిపారు.

బీజేపీ హిందీ జాతీయ‌వాదానికి అజ‌య్ దేవ‌గ‌న్ ఓ ప్ర‌చార‌కుడిగా మారార‌ని మాజీ సీఎం కుమార‌స్వామి ఆరోపించారు. హిందీ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క‌న్న‌డ సినిమా దాటి వేస్తోంద‌ని దేవ‌గ‌న్ గ్ర‌హించాల‌న్నారు. క‌న్న‌డ ప్ర‌జ‌ల ప్రోత్సాహంతోనే హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ వృద్ధి సాధించింద‌న్నారు. అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన తొలి చిత్రం పూల్ ఔర్ కాంటే .. బెంగుళూరులో ఏడాది పాటు ప్ర‌ద‌ర్శించార‌ని కుమార‌స్వామి గుర్తు చేశారు. హిందీ వివాదంపై క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్ చేసిన ట్వీటుతో వివాదం మొదలైంది.

హిందీ జాతీయ భాష కాదు అని, బీజేపీకి అనుకూల‌మైన వ్య‌క్తి దేవ‌గ‌న్ అని కిచ్చా సుదీప్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అజ‌య్ దేవ‌గ‌న్ రియాక్ట్ అవుతూ.. ఒక‌వేళ హిందీ జాతీయ భాష కాన‌ప్పుడు మ‌రెందుకు మీ సినిమాల‌ను హిందీలో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌శ్నించారు. సుదీప్‌కు మ‌ద్ద‌తుగా క‌ర్నాట‌క మాజీ సీఎంలు స్పందించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)