ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో మూడు రోజులుగా కొండ ప్రాంతంలో చిక్కుకుని అక్కడే ఉన్న ఏడుగురు వ్యక్తులను భారత వాయుసేన (ఐఏఎఫ్‌) రక్షించింది. డాక్యుమెంటరీ తీసేందుకు ముగ్గురు వ్యక్తులు నలుగురు పోర్టర్ల సహాయంతో నడుచుకుంటూ రుద్రప్రయాగ్‌ జిల్లాలో 4,500 మీటర్ల ఎత్తైన కొండల్లోని పాండవ్ షేరా ప్రాంతానికి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అయితే వెనక్కి తిరిగి వెళ్లే దారి తెలియక అక్కడ చిక్కుకున్నారు. వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోతుండటంతో సహాయం కోసం శుక్రవారం అత్యవసర సందేశం ‘ఎస్‌వోఎస్‌’ను పంపారు.

స్పందించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎడీఆర్‌ఎఫ్‌) అధికారి రిధిమ్ అగర్వాల్, ఎత్తైన కొండ ప్రాంతాల్లో రెస్క్యూ చేపట్టే బృందాన్ని సివిల్‌ హెలికాప్టర్‌లో శనివారం పంపారు. అయితే ఆ హెలీకాప్టర్‌ అంత ఎత్తుకు చేరుకోలేకపోయింది. దీంతో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) సహాయం కోరారు. ఐఏఎఫ్‌ సిబ్బంది చీతా హెలీకాప్టర్‌లో ఏడుగురు చిక్కుకున్న ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. అక్కడ చిక్కుకున్న ఏడుగురిని ఉదయం 6.30 గంటలకు రక్షించారు. ఏడుగురిలో నలుగురు పోర్టర్లతోపాటు ఒక వ్యక్తి ఉత్తరాఖండ్‌కు, మిగతా ఇద్దరు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)