Kolkata,October 1: ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లకి ఇంకా ఏడు నెలలు సమయం ఉంది. అయినప్పటికీ ముందే ఐపీఎల్ హంగామా మొదలైంది. ఈ ఏడాది చివర నుంచే ఐపీఎల్ టోర్నీహంగామా మొదలు కానుంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా బెంగళూరులో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తూ వస్తుండగా ఈ సారి వేదికను కలకత్తాకు మార్చారు. ఈ విషయాన్ని ESPNcricinfo రిపోర్ట్ చేసింది. కాగా డిసెంబర్ 19న 13వ ఎడిషన్ కోసం మినీ వేలం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఆటగాళ్లను బదలాయించడానికి, విడుదల చేయడానికి లీగ్ ట్రేడింగ్ విండో గడువు నవంబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాపై టీమ్‌లన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్‌కి సంబంధించిన వేలం గత ఏడాది జైపూర్ వేదికగా జరగగా 8 ఫ్రాంఛైజీలు రూ. 106.80 కోట్లు ఖర్చు చేసి 60 మంది ఆటగాళ్లని కొనుగోలు చేశాయి. ఈసారి డబ్బు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రేడింగ్ విండో ఆఖరి తేదీపై ఇప్పటికే ఎనిమిది ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ వెల్లడించింది. ఐపీఎల్ 2019 సీజన్ కోసం రూ.82కోట్లు కేటాయించిన ఆయా ఫ్రాంఛైజీలు 2020 సీజన్ కోసం రూ.85కోట్లతో జట్టును తయారుచేసుకోవాలని బిసిసిఐ సూచించింది. అదనంగా కేటాయించిన 3కోట్లతో పాటు గత ఐపీఎల్ వేలంలో వినియోగించని మొత్తాన్ని కూడా ప్రస్తుత సీజన్‌లో ఖర్చు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర అతి తక్కువగా రూ.1.8కోట్లు మాత్రమే మిగులు నిధులు ఉండగా రాజస్థాన్ రాయల్స్ వద్ద అత్యధికంగా రూ.7.7కోట్లు నిధులు ఉన్నాయి.
ఫ్రాంఛైజీల వద్ద మిగిలి ఉన్న నగదు వివరాలు ( అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్-రూ 5.30 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్-రూ 3.2 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్-రూ 8.2 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రూ 3.7 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్-రూ 6.05 కోట్లు
ముంబై ఇండియన్స్-రూ 3.05 కోట్లు
రాజస్థాన్ రాయల్స్-రూ 7.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రూ.1.80 కోట్లు