New Delhi, August 27: భారత స్టార్ షట్లర్, మన తెలుగు బిడ్డ పీ.వీ సింధు (PV Sindhu) ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచి ఈరోజు సగర్వంగా భారతదేశంలో అడుగుపెట్టింది. గత రాత్రి స్విట్జర్ లాండ్ నుండి ఢిల్లీ చేరుకున్న సింధుకు విమానాశ్రయంలో ఘనమైన స్వాగతం లభించింది. మంగళవారం రోజున ఆమె తన కోచ్ పుల్లెల గోపిచంద్, సహాయ కోచ్ కిమ్ మరియు తండ్రి రమణతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సింధును మరియు కోచ్ గోపిచంద్ ను అభినందించారు. సింధు తను సాధించిన బంగారు పతకాన్ని ప్రధాని చూపించగా, ప్రధాన మంత్రి ఆ పతకాన్ని తీసుకొని తిరిగి సింధు మెడలో వేసి ఆమెను గౌరవించారు.
భారత జాతి కీర్తి, ప్రపంచ ఛాంపియన్ సింధు అంటూ మోదీ కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మరిన్ని విజయాలను సింధు అందుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. సింధు తనని కలిసిన ఫోటోలను నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
India’s pride, a champion who has brought home a Gold and lots of glory!
Happy to have met @Pvsindhu1. Congratulated her and wished her the very best for her future endeavours. pic.twitter.com/4WvwXuAPqr
— Narendra Modi (@narendramodi) August 27, 2019
కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిరిజును కూడా సింధు కలిశారు. ఆయన కూడా సింధు విజయాన్ని కొనియాడారు. సింధు చరిత్ర సృష్టించింది, భారత జాతి గర్వించేలా చేసింది. ఇలాంటి విజయాలు మరిన్ని అందివ్వాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింధుకు రూ. 10 లక్షల రివార్డును ప్రకటించారు.
Also extended honour to @Pvsindhu1 's father PV Ramana, coach P. Gopichand & Kim from the Govt and BAI President @himantabiswa ji. pic.twitter.com/lfuvICj3y3
— Kiren Rijiju (@KirenRijiju) August 27, 2019
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ కు బంగారు పతకం సాధించి పెట్టిన తొలి క్రీడాకారిణి సింధు.
ఆగష్టు 25న, ఆదివారం రోజు జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహారాను (Nozomi Okuhara) 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. మెడల్ అందుకునేటపుడు భారత జాతీయ గీతం జనగణమన వినిపించినపుడు సింధు ఎంత భావోద్వేగానికి లోనైందో గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరియు మీడియాకు వివరించింది.
సింధు ఫైనల్ వరకు వెళ్తుంది కానీ అక్కడ గెలవదు, ఆమె కేవలం సిల్వర్ స్టార్ అనే విమర్శలు తననెంతో బాధించాయని అలాగే తనలో పట్టుదలను కూడా పెంచాయని చెప్పింది. తొలిసారిగా స్వర్ణ పతకం గెలిచిన క్షణాలలో జనగణమన వింటున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయానని సింధు తెలిపింది. భారతీయురాలైనందుకు తానెంతో గర్విస్తున్నాని ఆమె ఉద్వేగానికి లోనైంది.
24 ఏళ్ల సింధు తన కెరియర్లో ఎన్నో అద్భుత విజయాలను భారత్ కు అందించింది. అంతకుముందు 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 2 బ్రాంజ్ , 1 సిల్వర్ పతకాలను సాధించింది. ఇప్పుడు బంగారు పతకం సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసింది, ఒలంపిక్ సిల్వర్ మెడల్ కూడా సింధు ఖాతాలో ఉంది.