Birmingham, July 30: బర్మింగ్ హోమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth Games) రెండో రోజు భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ (Sanket Sargar) భారత్ కి సిల్వర్ మెడల్ ను (Silver medal) అందించారు. సంకేత్ సాగర్ ఫస్ట్ క్లీన్ అండ్ జర్క్‌లో ప్రయత్నంలో 135 కేజీల బరువుని ఎత్తి పతక రేసులో నిలిచాడు. అయితే రెండో ప్రయత్నంలో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డారు. దీంతో రెండో రౌండ్ లో విఫలమయ్యాడు. గాయం కారణంగా సంకేత్ మూడో పోటీలో పాల్గొనడని అందరూ భావించారు. కానీ మూడో ప్రయత్నంలో గాయంతో బాధపడుతూనే ట్రై చేశాడు. కానీ మోచేతికి గాయం నొప్పిని తాళలేక విఫలమయ్యాడు. 248 కేజీలతో రెండో స్థానంలో నిలి రజత పతకం తో సరిపెట్టాడు. మలేషియాకు చెందిన మహమ్మద్ అనిల్ మొత్తం 249 కేజీలు ఎత్తి స్వల్ప తేడాతో సంకేత్ ను అధిగమించాడు. దీంతో అతన్ని స్వర్ణ పతకం వరించింది. ఇదిలాఉంటే ఈ ఏడాది కామన్‌వెల్త్ పోటీల్లో భారత్‌ దక్కించుకున్న తొలి మెడల్ సంకేత్ దే కావడం గమనార్హం. ఇదిలాఉంటే టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు గ్రూప్ 2లో భారత జట్టు గయానాపై 3-0 తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ గ్రూప్ దశలో శ్రీలంకపై భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అదేవిధంగా లాన్ బాల్ టీమ్ ఈవెంట్ లో భారత్, మాల్టా 16-16 తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో తానియా చౌదరి ఓడిపోయింది.

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల కేటగిరీలో రజతం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించిన సంకేత్ సర్గర్ తాను మెడల్ గెలిచినా నిరాశగా ఉందని అన్నాడు. 55 కిలోల ఈవెంట్‌లో సంకేత్.. స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కిలోల బరువు ఎత్తాడు.మొత్తంగా 248 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో నిలిచిన మలేషియా ఆటగాడు బిబ్ అనిక్.. 249 కిలోలతో స్వర్ణం నెగ్గాడు. సంకేత్, అనిక్ మధ్య తేడా కిలో మాత్రమే. ఈ నేపథ్యంలో పోటీ ముగిశాక సంకేత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పతకం గెలిచినందుకు సంతోషమే. కానీ స్వర్ణం గెలుస్తానని అనుకున్నా. స్వర్ణం చేజారినందుకు నిరాశగా ఉంది. సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తున్నందుకు నామీద నాకే కోపంగా ఉంది..’అని ఆవేదన వ్యక్తం చేశాడు.

క్లీన్ అండ్ జెర్క్‌లో రెండో ప్రయత్నంలో సంకేత్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో డాక్టర్ తనను బరువు ఎత్తితే గాయం మరింత పెరిగే అవకాశముంటుందని హెచ్చరించినా.. సంకేత్ మాత్రం పోడియం వద్దకు వచ్చి తన శక్తినంతా కూడదీసుకుని బరువు ఎత్తాడు. ‘నేను దేశం కోసం పతకం గెలిచాను. ఇది చాలా బాగుంది. నేను ఇక భవిష్యత్ లక్ష్యాల మీద దృష్టి సారించాలి. మీరాబాయి చాను నాకు స్ఫూర్తి. ఆమెను ఎప్పుడు అడిగినా సలహాలిస్తుంది. నేనిక్కడిదాకా వచ్చానంటే దానికి నా తల్లిదండ్రుల కష్టమే కారణం. ఈ సందర్భంగా నేను వాళ్లకు, నా కోచ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని అన్నాడు.

ఇక కామన్‌ వెల్త్ లో మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ (Gururaja) కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురాజ.. స్నాచ్‌  విభాగంలో తొలి ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 118 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో 120 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ (Clean and jerk) విభాగంలో వరుసగా 144, 148, 151 కేజీలు ఎత్తాడు. మొత్తమ్మీద 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. మలేషియాకు చెందిన అంజిల్ బిన్ బిడిన్ ముహమ్మద్ 285 కేజీలతో గోల్డ్ మెడల్ సాధించాడు. అటు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రధాని మోదీ (PM MODI) శుభాకాంక్షలు తెలిపారు.